పేదల కోసం ఉడాన్ విమానయానం... సేవలు ప్రారంభించిన ప్రధాని మోడీ

గురువారం, 27 ఏప్రియల్ 2017 (16:34 IST)
సామాన్యుడి ఆకాశ విహారం పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఉడాన్) పథకంలో భాగంగా మొదటి ప్రాంతీయ విమానాన్ని ఆయన ప్రారంభించారు. సామాన్య ప్రజలకు విమానయాన సేవలు అందించే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన ఉడాన్‌(ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) పథకాన్ని మోడీ గురువారం ప్రారంభించారు. ఇందులోభాగంగా తొలి సర్వీసును హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో సిమ్లా - ఢిల్లీ మార్గంలో నడిచే తొలి ప్రాంతీయ విమాన సేవలకు ఆయన గురువారం పచ్చజెండా ఊపారు. అలాగే, కడప - హైదరాబాద్‌, నాందేడ్ ‌- హైదరాబాద్‌కు విమాన సేవలను కూడా ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ మధ్య తరగతి ప్రజల అభిలాష తీర్చేందుకే ఉడాన్‌ విమాన సేవలు ప్రారంభించినట్టు తెలిపారు. మధ్య తరగతి ప్రజలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. దేశంలో చిన్న, మధ్య తరహా విమానాశ్రయాల అనుసంధానానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ట్యాక్సీల్లో ప్రయాణిస్తే కిలోమీటర్‌కు సుమారు రూ.10 ఖర్చు అవుతుందని.. ఉడాన్‌ సర్వీసుల్లో కిలోమీటర్‌కు రూ.6 నుంచి రూ.7 వరకు మాత్రమే ఉంటుందన్నారు.  
 
కాగా, ప్రపంచంలో ఉడాన్ వంటి పథకం అమల్లోకి రావడం ఇదే మొదటిసారి. గత జూన్ 15న విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాతీయ విమానయాన విధానంలో ఉడాన్ కీలకమైనది. ఫిక్స్‌డ్ వింగ్ విమానంలో ప్రయాణ కాలం ఒక గంట, దాదాపు 500 కిలోమీటర్ల దూరం వెళ్ళేందుకు రూ.2,500 ఛార్జీ వసూలు చేస్తారు. హెలికాప్టర్‌లో అర గంట ప్రయాణ కాలానికి రూ.2,500 ఛార్జి వసూలు చేస్తారు. 

వెబ్దునియా పై చదవండి