ముఖ్యంగా, సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కోనున్న ఈ తరుణంలో ఆయన ఓటర్లను ఆకర్షించేలా ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ఇది ఓటాన్ అకౌంటేనని బయటికి చెబుతున్నా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తన పరిధిని దాటవచ్చనీ, నాలుగు నెలల కాలానికి పద్దు మాత్రమే కాక- అనేక వరాలను ప్రకటించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ బడ్జెట్‌లో వ్యవసాయదారులకు పెట్టుబడి సాయాన్ని ప్రకటించే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. తెలంగాణ రైతుబంధు పథకాన్నే దేశవ్యాప్తంగా అనుసరించవచ్చు. ఈ పథకానికి దాదాపు 70,000 కోట్ల రూపాయల నుంచి లక్ష కోట్ల దాకా ఖర్చవుతుందని ఓ అంచనా. అలాగే, మధ్యతరగతికి ప్రధానంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 60 ఏళ్ల లోపు వారికి రూ 3 లక్షలకు, 60 ఏళ్లు దాటిన వారికి రూ 3.5 లక్షలకు పెంచవచ్చంటున్నారు.
మహిళా టాక్స్ పేయర్లకు రూ 3.25లక్షల దాకా మినహాయింపునివ్వవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఇది జరగని పక్షంలో సెక్షన్-80సీ కింద ఇస్తున్న డిడక్షన్ లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న రూ లక్షన్నర నుంచి రెండు లక్షలకు పెంచుతారని వినిపిస్తోంది. అలాగే, పేదలకు సార్వత్రిక ఆదాయ పథకం ఒకటి. అధికారంలోకొస్తే దీన్ని చేపడతామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. నిరుద్యోగం ఉరుముతున్న దశలో దీన్ని వెంటనే ప్రకటిస్తే కొంతలో కొంత ఓట్లు రాబట్టుకునే ఈ బడ్జెట్ ఉండొచ్చని భావిస్తున్నారు.