మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. 6 వారాల్లో నాలుగోసారి

సోమవారం, 16 జనవరి 2017 (09:03 IST)
దేశంలో మరోమారు పెట్రోల్ ధరలు పెరిగాయి. గత ఆరు వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. పెంచిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా పెంపు మేరకు లీటరు పెట్రోల్‌పై రూ.0.42 పైసలు, డీజిల్‌పై 1.03 పైసలు చొప్పున పెరిగింది. 
 
తాజాగా పెరిగిన ధరలతో న్యూఢిల్లీలో ఒక లీటరు పెట్రోల్‌ ధర 71.13కు చేరుకోగా, డీజిల్‌ ధర 59.02పైసలకు చేరుకుంది. జనవరి 2వ తేదీన పెట్రోల్‌పై రూ.1.29, డీజిల్‌పై రూ.0.97 పైసల ధరను పెంచిన విషయం తెలిసిందే. ఆయిల్ ధరలు పెంచడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకోవడం, తగ్గించుకునే వెసులుబాటు చమురు కంపెనీలకు కేంద్రం కట్టబెట్టిన విషయం తెల్సిందే. అప్పటినుంచి దేశంలో చమురు ధరలను ప్రతి పక్షం రోజులకు ఒకసారి సమీక్షించడం జరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి