దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ కష్టాలు నెలకొనివున్నాయి. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు చేసి ఆదివారానికి 47 రోజులు కావొస్తుంది. కానీ, కరెన్సీ నోట్లతో పాటు.. చిల్లర కష్టాలు ఇంకా తొలగిపోలేదు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఏటీఎం కేంద్రాలకు వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి.
పైగా, భారత రిజర్వు బ్యాంకు ప్రకటిస్తున్న రోజుకో నిబంధనతో ఈ కష్టాలు మరింత రెట్టింపు అవుతున్నాయి. ఈ ఆంక్షల వల్ల, కొత్త నోట్ల వల్ల కష్టాలు తీరకపోగా మరింత పెరిగాయని ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పైగా విత్‌డ్రాపై విధించిన పరిమితులు ప్రజలకు గుదిబండగా మారాయి.
అయితే ఇటీవల బ్యాంకులు, ఏటీఎం సెంటర్లలో నగదు విత్‌డ్రాపై విధించిన పరిమితులను డిసెంబర్ 30తో ఎత్తివేయనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని తేలిపోయింది. డిసెంబర్ 30 తర్వాత కూడా ఆంక్షలు కొనసాగనున్నట్లు తెలిసింది. నోట్ల డిమాండ్‌కు తగినంత సప్లయ్ (నోట్ల సరఫరా) లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఇప్పటికే కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌ల్లో 2 వేల నోట్ల ముద్రణను తగ్గించారు. 5 వందల నోట్ల ముద్రణను పెంచారు. అయినప్పటికీ ఇవి అందుబాటులోకి రావాలంటే మరింత సమయం పట్టే అవకాశముందని సమాచారం. చాలామంది విత్‌డ్రా పరిమితులు పూర్తిగా తొలగిస్తారని భావిస్తున్నారని, కానీ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొంత ఉపశమనాన్ని కల్పించే ప్రయత్నాలే కేంద్రం నిర్వర్తిస్తోందని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.
బ్యాంకులు, ఏటీఎంల్లో తగినంత నగదు సమకూరేదాకా విత్‌డ్రాపై విధించిన పరిమితులు కొనసాగుతాయని ఆమె తెలిపారు. బ్యాంకుల్లో వారానికి 24 వేలు, ఏటీఎంల్లో రోజుకు 2,500 రూపాయల వరకూ తీసుకోవాలని, అంతకు మించి అందుబాటులో ఉండవని ఆర్బీఐ పరిమితి విధించిన సంగతి తెలిసిందే.