కొత్త యేడాదిలో ఆటో ఎక్కితే జీఎస్టీ బాదుడే

బుధవారం, 29 డిశెంబరు 2021 (09:49 IST)
కొత్త యేడాది ఆటో ప్రయాణం మరింత ప్రియం కానుంది. ఈ-కామర్స్ ద్వారా (యాప్‌) బుక్ చేసుకునే ఆటోలకు జీఎస్టీని వసూలు చేయనున్నారు. దీంతో ప్రయాణికులపై నిత్యం లక్షల రూపాయల మేరకు భారంపడనుంది. 
 
దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజల్ ధరల్ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. వీటి రేట్లు అనేక రాష్ట్రాల్లో సెంచరీ కొట్టాయి. దీంతో ఆటో, ట్యాక్సీల్లో ప్రయాణం చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో కొత్త యేడాది నుంచి యాప్‌ల ద్వారా బుక్ చేసుకునే ఆటోలు, మోపెడ్‌లకు కూడా జీఎస్టీని వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఫలితంగా వీటి ప్రయాణం మరింత భారంకానుంది. ర్యాపిడో బుక్ చేసుకున్నప్పటికీ ఈ జీఎస్టీ వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో కాకుండా బయట ఆటోను బుక్ చేసుకుంటే మాత్రం ఇది వర్తించదు. ఓలా, ఉబర్ వంటి రైడ్ షేరింగ్ యాప్‌లలో ఆటో బుక్ చేసుకుంటే మాత్రం ప్రభుత్వం 5 శాతం జీఎస్టీని వసూలు చేయాలని నిర్ణయించింది. బుక్ చేసుకునే సమయంలోనే ఐదు శాతం జీఎస్టీని కలిసి ధరను నిర్ణయిస్తారు. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే దాదాపు 4 లక్షల మందిపై భారంపడనుంది. నగరంలో 38 వేల ఆటోలు, ఓలా, ఉబర్ నుంచి బుకింగ్స్ స్వీకరిస్తున్నాయి. అలాగే ఒక్కో ఆటో రోజుకు 20 నుంచి 25 వేల ట్రిప్పులు వేస్తుంటాయి. ఇవన్నీ కలుపుకుంటే 8 లక్షల పైగా రైడ్లు అవుతున్నాయి. 
 
ఈ లెక్కన చూసుకుంటే ప్రయాణికులపై నిత్యం లక్షల రూపాయల భారం పడనుంది. నిజానికి పేద, మధ్యతరగతి ప్రజలు కారు కంటే ఆటోకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇపుడు ఈ ప్రయాణ చార్జీలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడంతో ప్రయాణికులపై మరింత భారంపడనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు