అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం అమెరికా ఉద్యోగాల మార్కెట్‌కు పెనుముప్పుగా పరిణమించింది. దాంతో ఉపాధి అవకాశాల కల్పనలో తగ్గుదల, ఉద్యోగాలలో కోతకు దారితీస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వినియోగదారులు క్రిస్‌మస్ పండుగకు అధిక మొత్తంలో ఖర్చు చేయని తరుణంలో సంక్షోభం తాలూకు పూర్తి ప్రభావం కొత్త సంవత్సరంపై పడుతుందని ఒక కన్సెల్టెంట్ కార్యాలయం సీఈవో జాన్ ఛాలెంజర్ తెలిపారు.
వినియోగదారులు తమ ఖర్చులో కోతను పాటించడంతో ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమవుతుందని జాన్ వెల్లడించారు. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిణామమైనప్పటికీ, రుణాల వసూలుదారులు, రెపోసెషెన్ అధికారులతో పాటు రియల్ ఎస్టెట్ న్యాయవాదులకు అమెరికా జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అలాగే బహుభాషా ప్రావీణ్యం కలిగి పలు దేశాల సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన గల వారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జాన్ తెలిపారు.