ఆక్స్‌ఫర్డ్ వర్శిటీలో భారత్‌పై కొత్త కోర్సు

మంగళవారం, 12 ఫిబ్రవరి 2008 (13:09 IST)
FileFILE
భారతదేశం, ఆ దేశం పొందుతున్న ఆర్థికాభివృద్ధిపై విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధాసక్తులు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సమకాలీన భారతదేశం ప్రధానాంశంగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కొత్తగా ఎమ్ఎస్సీ కోర్సును ప్రవేశపెట్టింది. కోర్సుకు సంబంధించి తొలి బ్యాచ్ విద్యార్థులను ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి నమోదు చేసుకుంటారు. అంతర్‌క్రమశిక్షణా ప్రాంతాల అధ్యయన పాఠశాల కొత్త కోర్సును ప్రారంభించనున్నది.

భారతదేశం సాధించిన విజయాలు, ఎదుర్కుంటున్న సమస్యలు మరియు భవిష్యత్తులో భారతదేశం తదితర అంశాలపై విద్యార్థులకు ఉన్నత శ్రేణి శిక్షణ మరియు అధ్యయన పద్దతుల ద్వారా నేర్పుతారు. సామాజిక శాస్త్రం మరియు చరిత్ర నేపథ్యంగా గల విద్యార్థులకు ఈ కోర్సు ప్రవేశానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

"భారతదేశంలో డాక్టరేట్ పరిశోధనలు చేసేందుకు తొలి దశగా ఈ డిగ్రీ తోడ్పడుతుంది. అధ్యయనం చేసేందుకు భారతదేశాన్ని మించిన వేదిక మరొకటి ప్రపంచంలో కానరాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అవతరించింది. ఐటీ విభాగంలో వాణిజ్యపరమైన విజయాలను సాధించడం ద్వారా భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చోటు సంపాందించుకుంటుందని" అభివృద్ధి అధ్యయనాల ప్రొఫెసర్ బార్బరా హారీస్ వైట్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో పాటు పలువురు భారతీయులు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు.

వెబ్దునియా పై చదవండి