పోటీ పరీక్షలకు ఇలా… సిద్ధం కావాలి

గురువారం, 17 జులై 2008 (16:21 IST)
ఉన్నత స్థాయి ఉద్యోగాలు కావాలనుకునే వారు ఈ రోజుల్లో పోటీ పరీక్షలను ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా సిద్ధం కావాల్సిందే. పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ప్రతినిత్యం పోటీపరీక్షలు నిర్వహిస్తూ అర్హులైన వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ముందుకొస్తున్న తరుణంలో వాటిని చేజిక్కించుకోవాలంటే మాత్రం కాస్త శ్రమించక తప్పదు.

అయితే ఈ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలనే విషయంపై చాలామంది విద్యార్థులు ఇప్పటికీ సరైన అవగాహన లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగాలు కోరుకునే వారు ఏ రీతిలో ఈ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

సివిల్ సర్వీసెస్‌తో పాటు రాష్ట్ర స్థాయిలో గ్రూప్ వన్, గ్రూప్ టు పరీక్షలు, బ్యాంకింగ్ పోటీ పరీక్షలు నిర్వహిస్తుండగా, వాటి ద్వారా భర్తీ చేసే వందల సంఖ్యలో సీట్లకోసం లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనూ ఆ పరీక్షల్లో గెలుపు మీ సొంతం కావాలంటే అందరిలా కాక కొంత భిన్నమైన రీతిలో దానికోసం మీరు సిద్ధం కావాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు ఆ పరీక్షలకు సిద్ధం చేసుకునే క్రమంలో కింది జాగ్రత్తలను కూడా పాటిస్తే గెలుపు శిఖరాలను అందుకోవచ్చు.

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో అంతకు ముందు ఏడాది అదే బోర్డు నిర్వహించిన పరీక్షల గురించిన వివరాలు తెలుసుకోవాలి. అప్పట్లో అడిగిన ప్రశ్నల ప్రాతిపదికన పరీక్షకు సిద్ధం కావాలి. దీనికోసం క్వశ్చన్ బ్యాంకు సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.

అలాగే సమయ పాలనను చక్కగా పాటించాలి. పోటీపరీక్షలు నిర్వహించే సంస్థ ఇచ్చిన సిలబస్ ప్రాతిపదికన ప్రిపరేషన్ జరగాలి. పాత ప్రశ్నాపత్రాల్లో అడిగిన వాటికి సరైన సమాధానాలు రాస్తూ తయారు కావాలి. అలా సమాధానమిచ్చే సమయంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయనే విషయాన్ని గుర్తెరిగి, అందుకు తగ్గట్టు సిద్ధం చేసుకోవాలి.

కొన్ని సమయాల్లో సరైన సమాధానం తెలిసినప్పటికీ, అజాగ్రత్త కారణంగా వాటిని సరిగ్గా రాయలేకపోయామనే విషయం తెలియగలదు. అలాగే మరికొన్ని సందర్భాల్లో ప్రశ్న అర్థం చేసుకోవడంలోనే ఇబ్బందులు ఏర్పడవచ్చు. కొన్ని పరీక్షల్లో సమాధానాలు రాసేందుకు తీసుకునే సమయం మీకు ఇచ్చిన గడువు సమయంకన్నా అధికంగా ఉండొచ్చు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.

అంతకుముందు పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు, అవి ఏ పాఠ్యాంశానికి చెందినవి, ఎన్ని మార్కులు రాగలవు అనే వాటిని క్వశ్చన్ బ్యాంక్ ద్వారా తెలుసుకుని, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. పాత క్వశ్చన్ బ్యాంకులు చూస్తే ఎటువంటి పరీక్షలు అడుగుతారనే విషయాన్ని ఓ రకంగా ఊహించుకోవచ్చు. ఎంతసేపు చదివాం, ఎలా చదువుతున్నాం అనే విషయాలకన్నా చదవాల్సిన విషయాలను చదువుతున్నామా అనేది చాలా ముఖ్యం. కొందరు ఎంతోకష్టపడి ఈ పరీక్షలకు సిద్ధమవుతారు కానీ ఫలితం సాదించలేరు. మెదడుకు పదునుబెట్టి శ్రమిస్తే మాత్రమే విజయాన్ని అందుకోగలరు.

ఏదేని విషయాన్ని ఆసక్తితో చదివితే అది మనసులో బలంగా నాటుకుపోతుంది. అందువల్ల మరింత చదవాలనే శ్రద్ధ ఏర్పడుతుంది. ప్రతిరోజూ ఎంతమేర చదవాలనేది కూడా మీ ప్రణాళికలో భాగంగా ఉండాలి. ఆ పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తే మీకు లభించే సామాజిక హోదా, ఆర్థిక స్థితి, పదవి, అధికారం, ఇతర వసతులను ఓసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే మీలో ఈ పరీక్షలపై కొత్త ఉత్సాహం ఏర్పడగలదు.

అంతేకాక చదివిన వాటిని చక్కగా జ్ఞాపకం పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. జ్ఞాపకశక్తితో మాత్రమే ఈ పోటీ పరీక్షలో విజయం సాధించగలరు. ప్రశ్నలు మళ్లీ, మళ్లీ చదవడం, రాయడం, మననం చేసుకోవడం, ఇబ్బందులు ఏర్పరుస్తున్న వాటిపై దృష్టి సారించడం వంటివి విజయానికి దోహదపడగలవు. అలాగే ఆ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న ఇతరులతో కలిసి గ్రూప్ స్టడీ చేయడం, ఉపాధికల్పనా కేంద్రాలు నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రాల్లో శిక్షణ తీసుకోవడం కూడా మిమ్మల్ని గెలుపు దిశగా నడిపింపజేస్తాయి.

వెబ్దునియా పై చదవండి