అమరావతి : ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషనర్ల నియమానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువును మరో పది రోజులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్‌కు సంబంధించి ఒక ప్రధాన సమాచార కమిషనర్, ముగ్గురు సమాచార కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొంది.
అయితే, వరుస సెలవులు కారణంగా దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం మరో పది రోజులకు పెంచింది. ఈ నెల 30 తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కల్పిస్తూ ప్రకటనను విడుదల చేసింది. దరఖాస్తులను వ్యక్తిగతంగా గానీ, రిజిస్టర్ పోస్టు ద్వారా గానీ... ఏపీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, 4వ అంతస్తు, డీపీఎస్ కన్ స్ట్రక్షన్స్, సాయిబాబా గుడి ఎదురుగా, జాతీయ రహదారి అనుబంధ సర్వీస్ రోడ్, మంగళగిరి-522503, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు దరఖాస్తులు అందజేయాలని ఆ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ(జీఏడీ) తెలిపారు.
అలాగే, సెక్రటేరియట్లో ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ(జీఏడీ) కార్యాలయంలో కూడా దరఖాస్తులను అందజేయొచ్చునని ఆ ప్రకటనలో ఆయన తెలిపారు. ఈ మెయిల్, ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించబోమని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ(జీఏడీ) స్పష్టం చేశారు.