జాబిల్లి తుది కక్ష్యలో ప్రవేశించిన చంద్రయాన్

గురువారం, 13 నవంబరు 2008 (00:41 IST)
చంద్రుని తుది కక్ష్యలోకి చంద్రయాన్1 విజయవంతంగా ప్రవేశించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రో- అధికారులు ప్రకటించారు. బుధవారం సాయంత్రం చంద్రునికి ఉపరితలంగా ఉన్న 100 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రయాన్ ప్రవేశించినట్లు ఇస్రో అధికారులు తెలిపారు. చంద్ర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన చంద్రయాన్ మరో రెండేళ్లపాటు ఈ కక్ష్యలోనే ఉంటుంది.

చంద్రుడికి అతి సమీప పాయింట్ అయిన 102 కిలోమీటర్ల పరిధిలో, అతి దూర పాయింట్ అయిన 255 కిలోమీటర్ల పరిధిలో చంద్రయాన్‌ను మంగళవారమే చంద్ర కక్ష్యలో ప్రవేశ పెట్టారు. బుధవారం సాంయంత్రానికి వంద కిలోమీటర్ల చంద్ర కక్ష్యలో చంద్రయాన్ విజయవంతంగా ప్రవేశించింది.

దీంతో భారత్ తలపెట్టిన ప్రతిష్టాత్మకమైన మానవ రహిత చంద్రయాన్ ప్రాజెక్ట్ పూర్తి విజయాన్ని సాధించినట్లయిందని ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్నాదురై ప్రకటించారు. కాగా, నవంబర్ 14-15 తేదీలలో ఉపగ్రహాన్ని చంద్రుని ఉపరితలంపైకి ఢీ కొట్టించి చంద్ర గ్రహ పరిశోధనలకు ఇస్రో శ్రీకారం చుట్టనుంది. ఈ సందర్భంగా చంద్రుడిపై భారత జాతీయ మువ్వన్నెల జండాను స్థాపించనున్నారు.

చెన్నయ్‌కి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీహరికోటలోని స్పేస్ పోర్ట్‌లో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంనుంచి చంద్రయాన్1 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్‌వి సి11 అంతరిక్ష వాహనం ద్వారా అక్టోబర్ 22న విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి