12న చెన్నైలోని న్యూ కాలేజీ డైమండ్ జూబ్లీ వేడుకలు

శుక్రవారం, 8 నవంబరు 2013 (18:37 IST)
WD
WD
చెన్నై నగరంలోని ప్రముఖ కాలేజీల్లో ఒకటైన 'ది న్యూ కాలేజ్' డైమండ్ జూబ్లీ వేడుకలు ఈనెల 12వ తేదీన జరుగనున్నాయి. రెండు రోజుల పాటు సాగే ఈ వేడుకలను భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రారంభించనున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేంద్ర మంత్రులు రెహ్మాన్ ఖాన్, జీకే వాసన్‌తో పాటు.. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామంత్రి పళనియప్పన్‌ తదితరులు పాల్గొననున్నారు. మద్రాసు విశ్వవిద్యాలయంలోని సెంటినరీ ఆడిటోరియంలో ఈ వేడుకలు జరుగుతాయని ది న్యూ కాలేజ్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ సభ్యులు, కాలేజీ ఛైర్మన్ యు.మొహ్మెద్ ఖలీలుల్లా, కో ఛైర్మన్ ఇంతియాజ్ పాషా, కన్వీనర్ ఎలియాస్ సేఠ్, గౌరవ కార్యదర్శి మొహ్మద్ అష్రాఫ్ శుక్రవారం వెల్లడించారు.

ఇదే అంశంపై వారు శుక్రవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ... స్వాతంత్ర్యం తర్వాత చెన్నై నగరంలో 1951లో ఏర్పాటైన తొలి మైనారిటీ విద్యా సంస్థ న్యూ కాలేజి అని గుర్తు చేశారు. నాడు 200 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ విద్యా సంస్థ ప్రస్తుతం 20 యూజీ, 11 పీజీ, 6 ఎంఫిల్, 7 పీహెచ్‌డీ కోర్సులతో సుమారు ఐదు వేల మంది విద్యార్థులతో ప్రగతి పథంలో ముందుకు సాగుతోందన్నారు.

మాజీ న్యాయమూర్తి దొరస్వామి రాజు, మాజీ కేంద్ర మంత్రి టీఆర్ బాలు, కేంద్ర మంత్రి జీకే వాసన్ తమ కాలేజీకి పూర్వ విద్యార్థులేనని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం మద్రాసు యూనివర్శిటీ పరిధిలో ఏడో ర్యాంకులో తమ కళాశాల ఉందన్నారు. తమ కాలేజీలో చేరే పేద విద్యార్థులకు యేడాదికి రూ.50 నుంచి రూ.75 లక్షల వరకు ఉపకారవేతనాలను అందజేస్తున్నట్టు చెప్పారు.

వచ్చే ఆరేళ్ళ కాలంలో తమ కాలేజీని మరింతగా విస్తరించనున్నట్టు తెలిపారు. ఇందులోభాగంగా కొత్తగా ఒక న్యాయ కాలేజీ, ఏఐఎస్, సీఏ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇందులో లా కాలేజీని చెన్నై నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో స్థాపిస్తామని, ఐఏఎస్, సీఏ శిక్షణా సంస్థలను చెన్నైలోనే నెలకొల్పుతామన్నారు.

ఇకపోతే.. డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి ప్రారంభిస్తారని చెప్పారు. రెండో రోజైన 13వ తేదీన విద్యా రంగంపై చర్చా గోష్టితో పాటు.. రాష్ట్రంలో ఉన్నత విద్య కోసం కృషి చేసిన పది మంది విద్యావేత్తలను ఎంపిక చేసి వారిని గౌరవిస్తామని వారు వివరించారు.

వెబ్దునియా పై చదవండి