ఆలూలేదూ చూలూ లేదు. అయినా సరే రజనీ వెనకే అంటున్న తమిళ తంబీలు

శుక్రవారం, 2 జూన్ 2017 (04:52 IST)
సమయం వచ్చినప్పుడు పోరుకు సిద్ధం కండని అభిమానులకు పిలుపునిచ్చి ఎంచక్కా సినిమా షూటింగుకు బయలుదేరిపోయిన సూపర్ స్టార్ ఆయన. గత ఇరవై ఏళ్లుగా ఆయన తమిళ నాడు రాజకీయాలతో దోబూచులాడుతూనే ఉన్నారు. భాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అంటూ అదరగొట్టే డైలాగులను సంధించే ఆయన తన రాజకీయ రంగ ప్రవేశంపై మాత్రం ఒక్కసారి కూడా స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం. అయినా సరే రాజకీయాల్లోకి వస్తాడో రాడో తెలియని ఆయన మౌనం కూడా తమిళనాడులో బాంబులాగా పేలుతోంది. 
 
మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణం తర్వాత అస్థిరత్వానికి మారుపేరుగా మిగలిపోయిన తమిళనాడు రాజకీయాల్లో తాజా ట్విస్ట్. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల చూపు రజనీపై పడుతోందన్న వార్త ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పార్టీ ప్రారంభిస్తే అందులో చేరడానికి ఐదుగురు అన్నాడీఎంకే శాసనసభ్యులు రెడీగా ఉన్నారనే మీడియా ప్రచారం కలకలం రేపుతోంది. రజనీకాంత్‌ ప్రస్తుతం ‘కాలా’  సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 
 
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల రజనీకాంత్‌కు మద్దతు పలుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేకు చెందిన ఐదుగురు శాసనసభ్యులు రజనీ పార్టీ పెడితే అందులో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తాజా ప్రచారం. దానికి తోడు ఇటీవల గాంధీ ప్రజా సంఘం అధ్యక్షుడు దమిళరువి మణియన్‌ రజనీకాంత్‌ను కలిసి అనంతరం ఆయన రాజకీయాల్లో ప్రవేశించడం తథ్యం అని రజనీకి తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. 
 
డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు రజనీతో సంప్రదింపులు జరపడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పన్నీర్‌సెల్వం, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి వర్గాలకు చెందిన పలువురు కార్య నిర్వాహకులు రజనీ వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే కాలా షూటింగ్‌ కోసం ముంబైలో మకాం పెట్టిన రజనీకాంత్‌ వీరెవరినీ కలవడానికి సుముఖం వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్నవారు తనతో రావొద్దని రజనీకాంత్‌ బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే.
 
ఆలూ లేదూ చూలూలేదు అన్న చందంగా ఇంకా రాజకీయాల్లోకి అడుగే పెట్టని రజనీ చుట్టూ ఇంత హైప్ క్రియేట్ కావడం చూస్తుంటే తమిళనాడులో సినిమాలకు, రాజకీయాలకు మధ్య అంతరం పూర్తిగా తొలిగిపోయినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు చెపుతున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి