ఆత్మరక్షణలో శశికళ వర్గం.. ఎన్నికల కమిషన్ తీర్పు నేడే.. పన్నీర్ వర్గంలో ఆశల మోసులు
మంగళవారం, 21 మార్చి 2017 (03:32 IST)
అన్నాడీఎంకే కోసం నువ్వా నేనా అంటూ పన్నీర్ సెల్వం, శశికళ మధ్యసాగుతున్న పోరుకు బుధవారం తెరపడనుంది. పన్నీర్‌సెల్వం వర్గం ఇచ్చిన ఫిర్యాదుల పరంపరపై మంగళవారం సాయంత్రంలోగా బదులివ్వాలని ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ) శశికళకు చివరిసారిగా గడువిచ్చింది. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే రెండుగా చీలిపోగా తమదే అసలైన అన్నాడీఎంకే అంటూ శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలు పోటీపడుతున్నా యి. ఐదేళ్ల సభ్యత్వం లేనందున ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదంటూ పన్నీర్ వర్గం ఎంపీలు సుమారు నెలరోజుల క్రితం ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేశారు.
పన్నీర్ వర్గం ఎంపీలు చేసిన ఫిర్యాదుపై బదులివ్వాల్సిందిగా శశికళకు సీఈసీ నోటీసు జారీ చేయగా ఆమె అక్క కుమారుడు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ బదులిచ్చి, ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురయ్యాడు. దీం తో శశికళ బదులివ్వాల్సి వచ్చింది. ఇలా సీఈసీ ఆదేశాల మే రకు శశికళ, పన్నీర్‌సెల్వం వరుసగా తమ తరఫు వాదనలను వినిపించారు.
ఇదిలా ఉండగా, ఆర్కేనగర్‌లో ఉప ఎన్నికలు ముంచుకు రావడంతో శశికళ వర్గం తరఫున దినకరన్, పన్నీర్ అభ్యర్థిగా మధుసూదనన్ రంగంలోకి దిగారు. ఈ నెల 24వ తేదీలోగా తమ అభ్యర్థులకు బీఫారం జారీ చేయాల్సి ఉంది. బీఫారం ఆధారంతో అభ్యర్థులకు సీఈసీ ఎన్నికల చిహ్నం కేటాయిస్తుంది. అయితే అన్నాడీఎంకే అభ్యర్థులమంటూ ఇద్దరు వ్యక్తులు పోటీపడుతుం డగా రెండాకుల చిహ్నం ఎవరికి దక్కుతుందో అనే సంశయం నెలకొంది. ప్రధా న కార్యదర్శిగా శశికళ ఎంపికపై సీఈసీ తీసుకున్న నిర్ణయంపై ఎన్నికల చిహ్నం కేటాయింపు ఆధారపడి ఉంది.
ఈ నెల 22వ తేదీ సీఈసీ తన తీర్పును వెల్లడిస్తుందని నమ్మకంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం దినకరన్ నేతృత్వంలో సీఎం ఎడపాడి తదితరులు అత్యవసరంగా సమావేశమయ్యారు. శశికళ తరఫు వాదనను మరోసారి వినిపించుకునేందుకు మరికొంత గడువు ఇవ్వాల్సిందిగా సీఈసీని కోరారు. ఇందుకు అంగీకరించిన సీఈసీ మంగళవారం సాయంత్రం లోగా తమకు అందజేయాలని శశికళకు తుది గడువు విధించింది. ఈ నెల 23వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తున్న పరిస్థితిలో 22వ తేదీన సీఈసీ తన తీర్పు వెల్లడించనున్నట్లు ఖాయంగా తెలుస్తోంది.
శశికళ తాజా వివరణతో చివరి ప్రయత్నం చేసిన తరుణంలో పన్నీర్ సైతం తన చివరి అస్త్రాన్ని సంధించారు. తమ వాదనను మరోసారి సమర్థించుకుంటూ సిద్ధం చేసుకున్న పత్రాలను సోమవారం పన్నీర్ వర్గంవారు సీఈసీకి సమర్పించారు. అంతేగాక ఆరువేల మంది పన్నీర్ మద్దతుదారులు ప్రమాణ పత్రాలను సైతం సీఈసీకి అందజేయడంతోపాటూ మరో 60 లక్షల మంది ప్రమాణపత్రాలను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని విన్నవించుకున్నారు.
ఇరువర్గాల నుంచి లిఖితపూర్వక వివరణలు పూర్తికావడంతో ఈ నెల 22వ తేదీన ప్రత్యక్ష విచారణకు సీఈసీ సిద్ధమైంది. 22వ తేదీ ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలి్సందిగా పన్నీర్, శశికళ వర్గాలకు ఢిల్లీలోని సీఈసీ కార్యాలయం నంచి ఆదేశాలు అందాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ జైదీ, కమిషనర్లు జ్యోతి, రావత్‌లతో ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్ ఇరువర్గాల ప్రతినిధులతో విచారణ చేపడుతుంది. అదేరోజు సాయంత్రం సీఈసీ తన తీర్పును ప్రకటిస్తుంది. క్షేత్రస్థాయి కార్యకర్తలు పన్నీర్ వైపే ఉండడంతో శశికళ వర్గం ఆత్మరక్షణలో పడిపోయింది.