ఎంజీఆర్ అల్లుడి హత్య కేసు : బంధువుకు జీవితశిక్ష.... చెన్నై కోర్టు తీర్పు

శుక్రవారం, 15 జులై 2016 (12:35 IST)
అన్నాడీఎంకే స్థాపకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) అల్లుడు విజయన్ హత్య కేసులో చెన్నై సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. దాదాపుగా ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ కేసులో ఎంజీఆర్ పెంపుడు కుమార్తె భాను శ్రీధర్‌తో సహా ఏడుగురికి కోర్చు జీవిత ఖైదు శిక్షను విధించి తీర్పునిచ్చింది. ఈ శిక్షతో పాటు వారందరికీ రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో ఆరు నెలల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని వెల్లడించింది. విజయన్... ఎంజీఆర్‌ మరణించిన తర్వాత ఆయన ఆస్తులకు, ప్రత్యేకించి కొన్ని విద్యాలయాలకు ట్రస్టీగా ఉండేవారు. 
 
కాగా, 2008 జూన్ 4న విజయన్ కారులో వెళ్తుండగా కోట్టూరుపురం వంతెన వద్ద ఐదుగురు దుండగులు మోటారు బైకులపై వచ్చి ఆయన వాహనాన్ని ఢీకొట్టారు. వారిని ప్రశ్నించేందుకు కారు దిగిన విజయన్‌పై దుండగులు ఇనుపరాడ్లతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ కేసును మొదట అభిరామిపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం సీబీసీఐడీకి అప్పగించారు. దాదాపు 70 మంది కోర్టులో సాక్ష్యులుగా నిలిచారు. 
 
కానిస్టేబుల్ కరుణ సహకారంతో సోదరి భర్తను భాను శ్రీధర్ చంపించినట్టు దర్యాప్తులో తేటతెల్లమైంది. ఆస్తి తగాదాలతో ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు రుజువైంది. కానిస్టేబుల్ కరుణకు భాను రూ. 4లక్షలు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. భానుకు సహకరించిన ఆమె స్నేహితురాలు భువన ఇప్పటికి పరారీలో ఉంది. పరారీలో ఉన్న భాను కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కోర్టు తీర్పుపై విజయన్ భార్య సుధ పోలీసులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తన భర్తకు చివరికి న్యాయం దక్కిందని ఆనందంతో కన్నీరుమున్నీరయ్యారు. 

వెబ్దునియా పై చదవండి