ఎన్ని బెదిరింపులు వచ్చినా, అడ్డంకులు ఎదురైనా పన్నీరు వెంట నడిచేందుకు 11 మంది ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరించిన తీరును, ప్రధాన ప్రతి పక్షం మీద జరిగిన దాడిని రాజ్‌భవన్‌లో గవర్నర్ విద్యాసాగర్‌రావుకు పన్నీరు సెల్వం నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం ఫిర్యాదు చేసింది. బలపరీక్ష ప్రజా స్వామ్యానికి విరుద్ధంగా జరిగిందని, దీనిని అంగీకరించ వద్దు అని, మళ్లీ బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు.
అనంతరం పన్నీరు సెల్వం తరఫున ఎమ్మెల్యే, మాజీ మంత్రి పాండియరాజన్ మీడియాతో మాట్లాడారు.మరో రోజు బలపరీక్షకు స్పీకర్ చర్యలు తీసుకుని ఉండాల్సిందని, అయితే, ప్రధాన ప్రతి పక్షంతో పాటు, కాంగ్రెస్ సభ్యులు సైతం సభలో లేని సమయంలో ఓటింగ్ నిర్వహించారని మండిపడ్డారు. అన్ని వివరాలను, ఆధారాలను గవర్నర్ ముందు ఉంచామన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పన్నీరు వెంట ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. త్వరలో మంచి నిర్ణయం వెలువడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అమ్మ డీఎంకేతో ముందుకు: అధికారం చిన్నమ్మ శిబిరం చేతికి చేరినా, ఎక్కువ కాలం ఈ ప్రభుత్వం కొనసాగేనా అన్న అనుమానాల్ని వ్యక్తం చేసే వాళ్లు రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నారు. ఆ దిశగా ఈ ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా తమ వైపు నుంచి పన్నీరు శిబిరంలోని ఎమ్మెల్యేలు ప్రయత్నాలు వేగవంతం చేయడానికి నిర్ణయిం చినట్టు తెలిసింది.
ఎమ్మెల్యేలు శిబిరం నుంచి బయటకు వచ్చి ఉండడంతో, తమ సన్నిహితుల ద్వారా తమకు మద్దతుగా నిలిచేందుకు ఇది వరకు నిర్ణయించిన వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. చిన్నమ్మ అధికారాన్ని ఢీకొట్టే విధంగా పార్టీ రెండాకుల చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ ద్వారా చేజిక్కించుకునే ప్రయత్నాలు వేగవంతం చేయడం లేదా, అమ్మ డీఎంకే నినాదంతో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే వ్యూహంతో పన్నీరు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం మద్దతు ఇస్తుండడం ఆహ్వానించదగ్గ విషయం.