అమ్మా.. నాన్న.. ఉద్యోగానికి.. మరి పిల్లల భవిష్యత్తు..?!

నేటితరం తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు పూల బాట వేయడం కోసం ఇద్దరూ ఉద్యోగాలు చేయడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఇది అందరూ అభినందించదగిన విషయమే అయనప్పటికీ... ఈ గజి'బిజి' ఉరుకుల పరుగుల జీవితంలో తమ పిల్లలు ఏం చేస్తున్నారో.. ఎలా పెరుగుతున్నారో.. పట్టించుకోవాల్సిన భాద్యతను మాత్రం విస్మరించకూడదు.

అసలు ఇద్దరూ ఉద్యోగం చేయడం ఎంత వరకూ అవసరం అనే విషయాన్ని గ్రహించాలి. తప్పనిసరి అయతే ఓకె. కానీ.. టైమ్‌పాస్ కోసం అయితే మాత్రం ఉద్యోగం చేయనవసరం లేదు. ఆ సమయాన్ని కాస్త పిల్లల పెంపకంపై పెడితే మీ పిల్లలు కూడా.. ఓ అబ్దుల్ కలాం, ఓ ఐన్‌స్టీన్ వంటి వాళ్లు కాగలరు.

ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పిల్లలకు కావలసిన అవసరాలన్నీ డబ్బుతోనే తీరుతాయనుకోవడం సరైన ఆలోచన కాదు. ఈ ప్రపంచంలో అన్నీ డబ్బుతో కొనలేమనే విషయం అనందరికీ తెలిసిందే. అందులో ఒకటి స్నేహం, మరొకటి ప్రేమ ఇవి రెండూ.. పిల్లలకు అందించాలి.

మీ పిల్లల కోసం వీలైనంత సమయాన్ని కేటాయించండి. మంచి చెడుల గురించి తెలియజేయడం. సమాజంలో ఎలా జీవించాలో.. ఎదుటి వారితో ఎలా ప్రవర్తించాలో వివరంగా చెప్పండి. సాధారంగా ప్రతి కుటుంబలో తండ్రి కుటుంబ పెద్దగా ఉండి ఎంతో కొంత సంపాదించి కుటుంబాన్ని పోషిస్తాడు. అది మానవధర్మం కూడాను. పురాణాల్లో కూడా పూర్వీకులు ఇదే విషయాన్ని చెప్పారు.

అయితే తండ్రి సంపాదించే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోతే.. తల్లి కూడా తప్పనిసరై ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అలాంటపుడు తల్లి ఏదైనా పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని ఎంచుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల కొంత అధిక సమయాన్ని పిల్లల కోసం కేటాయించే అవకాశం కలుగుతుంది.

ఈ రోజుల్లో "వర్క్ ఫ్రమ్ హోమ్" వంటి ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎంచుకుంటే ఇంటి వద్దనే ఉండి పని చేసుకుంటూ పిల్లల ఆలనా పాలనా చూసుకోవచ్చు. ఇక ఇద్దరూ తప్పనిసరై బయటకి వెళ్లి ఉద్యోగాలను చేయాల్సినపుడు మాత్రం పిల్లల విషయంలో కొంత ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పిల్లలకు తల్లితండ్రులు తమను పట్టించుకోవడం లేదనే భావన కలగకుండా.. మీ తీరిక సమయాన్ని వారి కోసం కేటాయించండి. ఒక రకంగా ఇలా చేయడం మీకు కూడా మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లలతో ఆనందంగా గడపడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంత జీవనం గడుపుతారు. కాబట్టి మీ పిల్లలతో మీరు సంతోషంగా గడిపి వారిలో కలిగే అభద్రాతాభావాన్ని తొలగించండి. అపుడు అంతా శుభమే..!!

వెబ్దునియా పై చదవండి