పిల్లలకు జబ్బు చేస్తే వారిని పక్కనే వుంటారు. మంచం మీద నుంచి వారిని లేవనీయరు.. జబ్బు తగ్గేవరకు బయట తిరగనివ్వరు అయితే చాలారకాల జబ్బుల్లో రోజంతా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పిల్లలు కాస్త కోలుకోగానే.. వారిని మంచం మీద నుంచి దించేసి.. ఆడుకోనివ్వాలి. కానీ ఆరుబయట కాకుండా ఇంటి బాల్కనీలో ఆడుకోనివ్వడం చేయాలి.
ఒకవేళ పిల్లలు మంచం మీది నుంచి లేవలేకపోతున్నా, విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినప్పుడే వారిని మంచం నుంచి కిందికి దించకూడదు. నిజానికి జబ్బుతో ఉన్నప్పుడు పిల్లల్లో ఏకాగ్రత తగ్గుతుంది. ఎక్కువసేపు ఆడుకోవాలని ఉన్నా ఆడుకోలేరు. కొన్నిసార్లు పిల్లలు పెద్దవాళ్లు దృష్టి తమ మీద పడేందుకూ ప్రయత్నిస్తుంటారు. అందుకే దగ్గరుండి తల్లిదండ్రులు సముదాయిస్తే సంతోషిస్తారు.
అలాంటప్పుడు ఒక్కరినే పడకగదిలో పడుకోబెట్టటం కన్నా అందరూ తిరిగే చోట సోఫా మీద పడుకోబెట్టటం మంచిది. పిల్లలకు వినోదం కలిగించే ప్రయత్నం చేస్తే వారిలో కొత్త హుషారు వస్తుంది.వారికి ఇష్టమైన ఆటబొమ్మలను అందుబాటులో ఉంచాలి. వీలైతే దగ్గరుండి ఆడించాలి. ప్రేమగా నిమురుతూ సముదాయించాలి. ఇలా చేస్తే జబ్బు నుంచి పిల్లలు శీఘ్రంగా కోలుకుంటారు.