పిల్లల సంరక్షణ బాధ్యతలు చూడాల్సింది పాఠశాలలే...!

File
FILE
ఇటీవల కాలంలో పాఠశాల విద్యార్థులపై అధ్యాపకుల దాడులు, లైంగిక వేధింపులు అధికమైపోయాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే విచక్షణ మరచి ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించే ఇటువంటి వారిపై పాఠశాల యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అదేసమయంలో మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది.

పాఠశాలలు సైతం తమ విద్యా సంస్థలలో చదివే విద్యార్థుల రక్షణకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పాఠశాల యాజమాన్యాన్ని నమ్మి తమ పిల్లల భవిష్యత్తును అధ్యాపకుల చేతుల్లో పెడుతున్న తల్లిదండ్రుల నమ్మకానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదు.

వీలైనంత వరకూ పాఠశాలలు నెలలో ఏదో ఒక రోజున పిల్లల తలిదండ్రులతో ఒక సమావేశాన్ని నిర్వహించాలి. ఈ సమావేశంలో పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులకు తెలియజేయడం, వారి అభిప్రాయాలను సేకరించడం వంటివి చేయడం ద్వారా చాలా ఫలితం ఉంటుంది.

అధ్యాపకులంటే కేవలం చదువు మాత్రమే చెప్పే మరబొమ్మలుగా మారకూడదని గర్తించాలి. నేటి సమాజంలో మనం ఎక్కడున్నాం.. ఒకప్పుడు ఎలా బ్రతికాం.. నేటి సాంకేతిక పరిజ్ఞానం ఏంటి.. ఇలాంటి ప్రశ్నలు ఒక్కసారి తమలో తాము ప్రశ్నించుకుంటే ఇటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు.

అధ్యాపకులు పిల్లలకు చదువులను నేర్పటంతో పాటు వారిలో మనోస్థైర్యాన్నిపెంపొందించాలి. ప్రస్తుతం చరిత్రలో మనం చూసే పెద్ద పెద్ద వాళ్లు కూడా ఒకప్పటి బాలలేనని గుర్తించాలి. వారు అంత పేరు సాధించటానికి వారిని ఏదో తెలియని శక్తి ప్రభావితం చేసి ఉంటుంది. ఆ శక్తి మరేదో కాదు గురువే..!

పాఠశాలలు పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ప్రయత్నించాలి. ఆ మేరకు శిక్షణ కల్పించాలి. ఆ రంగంలో వారికి తగు ప్రోత్సాహం ఇవ్వాలి. వారిని నిరుత్సాహ పరిచేవిధంగా మాట్లాడకూడదు. తరాలు మారుతున్నాయి. వాటితోపాటు మనం చెప్పే విధానాలు కూడా మారాలి.

తల్లితండ్రులు సైతం పిల్లల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏదో కార్పోరేట్ స్కూల్‌లో చేర్పించేశాం.. ఇంకేముందిలే అంతా వాళ్లే చూసుకుంటారు అనుకోకూడదు. పిల్లలతో వీలైనంత వరకూ బట్టీ పట్టి చదివించడం మాన్పించాలి. ఏదైనా అర్థం కాకపోతే వారికి అర్థమయ్యేంత వరకూ ఓర్పుగా నేర్పాలి.

20శాతాబ్దపు పిల్లలకు 80వ శతాబ్దపు పద్ధతిలో విద్య నేర్పితే అది ఎంత వరకూ అబ్బుతుంది...? అనే ప్రశ్నను ఉపాధ్యాయులు వేసుకుని తగు విధంగా విద్యా బోధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

వెబ్దునియా పై చదవండి