ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడాలంటే.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అంటున్నారు. ముఖ్యంగా, వ్యాక్సిన్ల ఫలితం తేలేవరకు అప్రమత్తతే శ్రీరామక్ష అని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే, ఈ కరోనా వైరస్ వేవ్.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో ఉన్నప్పటికీ.. అన్నిచోట్లా భవిష్యత్తులో కొవిడ్-19 సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సంభవించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సెకండ్ వేవ్ కొనసాగుతోందన్నారు.
దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల తగ్గుదల, పెరుగుదలను ప్రభావితం చేసే కనీసం 100కుపైగా హాట్‌స్పాట్లు ఉన్నాయన్నారు. మాస్క్‌లు ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి ఆరోగ్య రక్షణ చర్యలతో రాబోయే కరోనా వేవ్‌లను ఆలస్యం చేయడం తప్ప, ఇప్పుడు మరో మార్గం లేదని మిశ్రా స్పష్టంచేశారు.
మరో రెండేళ్లపాటు ఈవిధంగా అత్యంత అప్రమత్తతతో ప్రజలు వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. కరోనా వ్యాప్తికి చలికాలం సీజన్ కంటే మనుషుల బాధ్యతారాహిత్యం, అజాగ్రత్తలే ఎక్కువ ఊతమిస్తాయన్నారు. ప్రస్తుతం అభివృద్ధిచేస్తున్న కరోనా వ్యాక్సిన్లు పనిచేస్తాయా? పనిచేయవా? అనేది తేలేందుకే ఇంకొన్ని సంవత్సరాలు పడుతుందని, అప్పటి వరకు అప్రమత్తతే శ్రీరామక్ష అని ఆయన చెప్పుకొచ్చారు.