అనంతపురంలో తగ్గని కరోనా కేసులు - ఆ రెండు జిల్లాల్లో సున్నా

బుధవారం, 16 మార్చి 2022 (20:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కరోనా కేసులు చాలా మేరకు తగ్గిపోయాయి. కానీ ఒక్క అనంతపురంలో మాత్రం ఈ కేసులు ఇంకా అధికంగానే నమోదవుతున్నాయి. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గడిచిన 24 గంటల్లో ఈ జిల్లాలో 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 69 కేసులు నమోదయ్యాయి. అయితే, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు, గత 24 గంటల్లో 82 మంది కోలుకోగా, ఒక్కరు కూడా కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోలేదు. 
 
తాజాగా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,19,012కి పెరిగాయి. అలాగే, ఈ వైరస్ నుంచి 23,03,772 మంది కోలుకున్నారు. మొత్తం 14,730 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుంత రాష్ట్ర వ్యాప్తంగా 510 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
భారత్‌కు పొంచివున్న ముప్పు 
పొరుగు దేశమైన చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి పతాకస్థాయికి చేరేలా కనిపిస్తుంది. రోజువారీగా నమోదయ్యే స్టెల్త్ ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా చైనాలోని పలు నగరాల్లో సంపూర్ణ లాక్డౌన్, పాక్షిక లాక్డౌన్‌ను అమలు చేస్తున్నారు. 
 
మరోవైపు, చైనాలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో భారత్‌కు కూడా ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దఫా కరోనా వైరస్ ఏకంగా 75 శాతం మందికి సోకవచ్చని కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
కరోన్ థర్డ్ వేవ్ రావడానికి ప్రధాన కారణం బీఏ.2 వేరియంట్ అని, ఇప్పటికీ దాని ఆనవాళ్లు ఉంకా కనిపిస్తున్నాయని, అందువల్ల నాలుగో దశ కరోనా వైరస్ వ్యాప్తి తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే జూలై నెలలో నాలుగో వేవ్ ప్రారంభంకావొచ్చని ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు