చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా ... ఇంట్లోనే ఐసోలేషన్...

సోమవారం, 26 డిశెంబరు 2022 (12:05 IST)
చైనాలో పని చేస్తూ స్వదేశానికి తిరిగివచ్చిన ఓ వ్యక్తి కరోనా వైరస్ ఉన్నట్టు విమానాశ్రయంలో జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో తేలింది. దీంతో ఆ వ్యక్తి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. పైగా, ఆ వ్యక్తిని ఇంటిలోనే ఐసోలేషన్‌కు తరలించినట్టు ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏకే శ్రీవాస్తవ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, చైనాలో పని చేస్తూ ఆగ్రాకు వచ్చిన ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలైతే కనిపించలేదన్నారు. ప్రస్తుతం అతన్ని షాగంజ్‌లోని ఆయన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. నవంబరు 25వ తేదీ తర్వాత ఇక్కడ వెలుగు చూసిన కేసు ఇదొక్కటేనని తెలిపారు. యాక్టివ్ కేసు కూడా ఇదేనని తెలిపారు. పైగా, ఈ వ్యక్తిని కలిసినవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
 
చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్ 7 వైరల్ శరవేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ దెబ్బకు చైనా అల్లకల్లోలంగా మారింది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం కొన్ని దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేసింది.
 
అలాగే, ఆగ్రా రైల్వే స్టేషన్, బస్టాపులు, విమానాశ్రయాల్లో టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తాజ్ మహాల్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు అధికారులు టెస్టులు చేస్తున్నారు. మీరు ముఖ్యంగా విదేశీ పర్యాటకులపై అధికారులు నిశితంగా దృష్టిసారించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు