చైనాలో కొత్త వైరస్... గబ్బిలాల్లో గుర్తించిన సైంటిస్టులు

ఆదివారం, 13 జూన్ 2021 (11:05 IST)
కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావించే చైనాలో మరో కొత్త రకం వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ గబ్బిలాల్లో కనుగొన్నారు. కరోనా వైరస్ మూలాల గురించి దర్యాప్తు చేస్తున్న చైనా పరిశోధకులకు ఈ కొత్త వైరస్ గురించి వెలుగులోకి వచ్చింది. 
 
గబ్బిలాలలో కొత్తగా కనిపించిన వైరస్‌లు కోవిడ్ - 19 వైరస్‌ రెండూ జన్యుపరంగా ఒకేలా ఉన్నట్లుగా చైనా గుర్తించింది. గబ్బిలాల్లో కరోనా వైరస్‌లకు సంబంధించిన కొత్త బ్యాచ్‌ను గుర్తించామని, కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2తో జన్యుపరంగా అత్యంత ఎక్కువ సారూప్యత ఉందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
గబ్బిలాల్లో ఇంకా గుర్తించని కరోనా వైరస్‌లు ఎన్నో మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని, అటువంటి రకాలపై ఒక అంచనాకు వచ్చేందుకు పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
చైనాలోని షాండాంగ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.. 2019 మే నుంచి గత ఏడాది నవంబరు వరకూ అడవుల్లో ఉండే గబ్బిలాల నుంచి మలాలను, నోటి శ్వాబ్‌ నమూనాలను సేకరించి పరీక్షించినట్లు చెప్పారు. 
 
చైనా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మొత్తం 24 కరోనా వైరస్ జన్యు క్రమాలను సేకరించామని, వైరస్‌లలో ఒకటి ప్రస్తుతం ఉన్న వైరస్‌కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని, జన్యుపరంగా SARS-CoV-2 వైరస్‌కు దగ్గరగా ఉందని, ఇదే కొనసాగుతున్న మహమ్మారికి కారణం అవుతుందని చెబుతున్నారు. 
 
మరోవైపు కోవిడ్ 19కి కారణమయ్యే కరోనావైరస్ మూలం గురించి ఒకటన్నర సంవత్సరాల తరువాత కూడా మిస్టరీగా మిగిలిపోయింది, చైనాలోని వుహాన్ నగరంలో ఫస్ట్ కేసు నమోదుకాగా, శాస్త్రవేత్తలు, దేశాలు వైరస్ సహజంగా ఉద్భవించిందా? లేదా వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లో తయారైందా? అనేదానిపై పరిశోధనలు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు