మెక్సికోలో మొదలైన కరోనా థర్డ్ వేవ్

ఆదివారం, 11 జులై 2021 (12:13 IST)
అందరూ ఊహించనట్టే జరిగింది. మెక్సికోలో థర్డ్ వేవ్ మొదలైంది. ఆ దేశంలో గత వారం రోజులుగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మునుపటి వారంతో పోల్చితే ఈ వారం 29 శాతం ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా మూడో దశ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉండబోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
మెక్సికోలో కరోనా వైరస్ ఉధృతి గత జనవరి నెలలో తారస్థాయికి చేరింది. క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ జులై మాసంలో సెకండ్ వేవ్ ముగిసింది. సెకండ్ వేవ్ ముగిసినందుకు ప్రజలు హాయిగా ఊపిరిపీల్చుకుంటున్న వేళ.. మరో నెల రోజుల వ్యవధిలోనే అక్కడ థర్డ్ వేవ్ మొదలైంది. 
 
అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నట్లు మెక్సికో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా పేషంట్స్ కోసం సిద్ధం చేసిన ఆస్పత్రి బెడ్స్‌లో 22 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. సెకండ్ వేవ్ ఉధృతిగా ఉన్న సమయంలో అక్కడి ఆస్పత్రుల్లోని బెడ్స్ అన్ని రోగులతో నిండిపోయాయి.
 
థర్డ్ వేవ్‌లో ఎక్కువగా యువకులు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ బారినపడుతున్నట్లు మెక్సికో దేశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అలాగే వ్యాధి సోకేందుకు తక్కువ అవకాశాలున్న వారిలో ఎక్కువగా కరోనా ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి. 
 
యువకులు, ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ అనుకున్న వారు వ్యాక్సిన్లు వేసుకోకపోవడమే థర్డ్ వేవ్‌లో వారు కరోనా బారినపడుతుండటానికి కారణంగా వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే వృద్ధులు తక్కువ సంఖ్యలోనే థర్డ్ వేవ్‌లో కరోనా బారినపడుతున్నారు. 
 
వృద్ధులకు వ్యాక్సినేషన్‌ను గణనీయ స్థాయిలో పూర్తి చేయడమే దీనికి కారణమని భావిస్తున్నారు. శుక్రవారంనాటికి దేశంలోని వయోజనుల్లో 39 శాతం మందికి ఒక వ్యాక్సిన్ పూర్తయినట్లు మెక్సికో అధికారులు వెల్లడించారు.
 
కాగా, మెక్సికో‌లో దాదాపు 13 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ దేశ అధికారిక గణాంకాల మేరకు ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా మహమ్మారి బారినపడి 2,35,000 మంది చనిపోయారు. అయితే వాస్తవ కరోనా మృతుల సంఖ్య 3,60,000 గా ఉండొచ్చని అంచనావేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు