ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఓ కరోనా వైరస్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణంలోని చిన్నబజారుకు చెందిన 24 యేళ్ళ యువకుడికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే, ఇపుడు మరో వృద్ధురాలికి కూడా ఈ వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి.
తాజాగా, ఆమెలో వైరస్ లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు పట్టణంలోని సర్వజన వైద్యశాలకు తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం పూణె పంపించారు. రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
మరోవైపు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, తమిళనాడుల్లో కరోనా కేసులు నమోదు కావడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల వ్యవధిలో రెండు కేసులు వెలుగు చూశాయి. వీటిలో ఓ కేసు ఇప్పటికే నిర్ధారణ కాగా, ఇపుడు కర్నూలు వృద్ధురాలి విషయంలో పరీక్షా ఫలితాలు వెల్లడికావాల్సివుంది.