చికెన్ కేజీ ధర రూ.5 - కేరళలో లక్షలాది కోళ్ళను చంపాలంటూ ఆదేశం
శనివారం, 14 మార్చి 2020 (12:36 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. ఇప్పటికే 130 దేశాలకు విస్తరించిన ఈ వైరస్.... ఇప్పటికే వేలాది మందిని హతమార్చింది. లక్షలాది మందికి సోకింది. ముఖ్యంగా మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే కేరళలో మాత్రం మరింతగా వస్తరించింది. ఈ రాష్ట్రంలో కేరళలో తీవ్ర అలజడి సృష్టిస్తోంది.
మరోవైపు బర్డ్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇటీవలే కేరళలోని కొజికోడ్‌లో రెండు కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కనిపించడంతో వాటి ప్రభావిత ప్రాంతాలకు ఒక కిలోమీటరు పరిధిలో అన్ని కోళ్లను చంపేయాలని అధికారులు ఆదేశించడంతో వాటిని చంపేశారు.
తాజాగా, పరప్పణగడిలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు. దీంతో ఆ కోళ్లను కూడా చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో మరోసారి వేలాది కోళ్లు బలి కానున్నాయి. కోళ్లను చంపేందుకు ప్రభుత్వ అధికారులు ఇప్పటికే ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
పరప్పణగడిలో ఉన్న అన్ని పౌల్ట్రీల్లో వైద్య సిబ్బంది కోళ్లను పరీక్షిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ కేంద్ర బిందువైన ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ దూరం వరకు ఉన్న అన్ని పౌల్ట్రీల్లో ఉన్న కోళ్లను చంపేయనున్నారు.
మరోవైపు, భారత్ పౌల్ట్రీ రైతులపై కూడా దీని ప్రభావం భారీగానే పడిందని చెప్పాలి. చికెన్ తింటే కరోనా వస్తుందంటూ పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తుండటంతో చికెన్ సేల్స్ పూర్తిగా డౌన్ అయిపోయాయి. దీనితో పౌల్ట్రీ రైతులు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఓ రైతు కరోనా భయంతో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కర్ణాటకలోని గోకక్ తాలూకా లోలాసూర్ గ్రామానికి చెందిన నజీర్ అహ్మద్ అనే రైతు కరోనా వైరస్ వదంతులు కారణంగా చికెన్ సేల్స్ పడిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై దాదాపు ఆరు వేల కోళ్లను గుంత తవ్వి సజీవంగా పూడ్చి పెట్టాడు. అనంతరం అతడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం చికెన్ ధర కేజి రూ.5 నుంచి రూ.10 వరకు అమ్ముడవుతోందన్నాడు.
ఇక తాను కోళ్లను పెంచడానికి రూ.6 లక్షలు ఖర్చయిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీటిని నిర్వహించాలంటే తనకు ఖచ్చితంగా నష్టం చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, అతడు కోళ్లను పూడ్చి పెట్టిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. కొందరు అతని చేసిన పనిపై మండిపడుతున్నారు.