నెలాఖరు నాటికి కరోనా వైరస్‌ మరింత ఉధృతం : చెస్ట్ సొసైటీ

శనివారం, 4 ఏప్రియల్ 2020 (18:17 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మనదేశంలో కూడా శరవేగంగా వ్యాప్తిస్తోంది. ఇది ఈ నెలాఖరు నాటికి మరింతగా విశ్వరూపం దాల్చే ప్రమాదం ఉన్నట్టు ఇండియన్ చైల్డ్ సొసైడీ చీఫ్ క్రిస్టోఫర్ అభిప్రాయపడుతున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ నెల చివరినాటికి భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉందన్నారు. 'మనకి మరో నెల సమయం ఉంది. ఏప్రిల్‌ చివరి నాటికి లేక మే తొలి వారం నాటికి దేశంలో కరోనా కేసులు తీవ్రతరమయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు.

అయితే, పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేస్తే ఈ తీవ్రతను తగ్గించుకోవచ్చు' అని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ చర్యలతో తప్పకుండా కరోనా వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందని వివరించారు. 
 
ఇదిలావుండగా, దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఓ నివేదిక రూపొందించింది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 41 శాతం మంది 21 నుంచి 40 ఏళ్ల వయసు వాళ్లేనని కేంద్రం వెల్లడించింది. 17 శాతం మంది 60 ఏళ్లకు పైబడినవాళ్లని, 9 శాతం మంది 20 ఏళ్ల లోపువారని పేర్కొంది.
 
కరోనాపై రాష్ట్రాలు పాటించాల్సిన సూచనలను వెబ్‌సైట్‌లో ఉంచామని, మాస్కులు, చేతి తొడుగుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వివరించింది. దేశం మొత్తమ్మీద కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ల నుంచి అత్యంత సమస్యాత్మక కేసులు వస్తున్నాయని వెల్లడించింది. కరోనా నియంత్రణలో కేంద్ర మార్గదర్శకాలు విధిగా పాటించాలని స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు