ఇరాన్‌లో కరుడుగట్టిన నేరస్థుల రిలీజ్.. ఎందుకో తెలుసా?

మంగళవారం, 10 మార్చి 2020 (11:38 IST)
ఇరాన్ దేశాలో కరుడుగట్టిన నేరస్థులను ఆ దేశం విడుదల చేసింది. ఈ నేరస్థులపై ఎన్నో రకాలైన కఠిన నేరాలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా రిలీజ్ చేసింది. దీనికంతటికి కారణం కరోనా వైరస్. 
 
కరోనా వైరస్ బారినపడిన టాప్-3 దేశాల్లో ఇరాన్ ఒకటి. ఈ దేశంలో కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 237గా ఉంది. అలాగే, వైరస్ బాధితుల సంఖ్య 7 వేలను దాటింది. దీంతో వివిధ జైళ్ళలో ఉన్న నేరస్థులను విడుదల చేయాలని నిర్ణయించింది. 
 
ఫలితంగా దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ రకాల నేరాలు చేసి, శిక్షను అనుభవిస్తున్న దాదాపు 70 వేల మందిని విడుదల చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహీం రైసీ వెల్లడించారు. ఖైదీల విడుదలపై ఇరాన్ పత్రికలు, వెబ్ సైట్లలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. 
 
ఈ నిర్ణయంతో సమాజంలో అభద్రతా భావం కలుగబోదని ఇబ్రహీం వ్యాఖ్యానించారు. ఇక విడుదల చేసిన వారిని వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత తిరిగి జైళ్లకు తరలిస్తారా? లేదా? అన్న సంగతిని మాత్రం ఆయన వెల్లడించ లేదు. మొత్తంమీద కరోనా వైరస్ దెబ్బకు కరుడుగట్టిన నేరస్థులకు విముక్తి లభించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు