మహారాష్ట్ర కరోనా ఉధృతి : రెండోసారి వైరస్ బారినపడిన మంత్రి

బుధవారం, 24 మార్చి 2021 (09:46 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో రోజుకు దాదాపు 25 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు రెండోసారి ఈ వైరస్‌ కోరల్లో చిక్కారు. దీంతో ఆయన దవాఖానలో చేరారు. ఈ మధ్యకాలంలో తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. 
 
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో సామాజిక న్యాయం, స్పెషల్‌ అసిస్టెన్స్‌ శాఖ మంత్రిగా ధనుంజయ్‌ ముండే పనిచేస్తున్నారు. ఎన్సీపికి చెందిన ఈయనకు గతేడాది జూన్‌ నెలలో కరోనా వైరస్ సోకింది. మరోసారి తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఆయన ట్విటర్‌ ద్వారా మంగళవారం అర్థరాత్రి ప్రకటించారు.
 
"నాకు ఈరోజు రెండోసారి కరోనా పాజిటివ్‌ వచ్చింది. గత కొన్నిరోజులుగా తనను కలిసిన ప్రతిఒక్కరు పరీక్షలు చేయించుకోవాలి. తనగురించి భయపడాల్సింది ఏమీలేదు. ప్రతిఒక్కరు విధిగా మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలి" అని మరాఠీలో ట్వీట్‌ చేశారు.
 
ఇదిలావుంటే, మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 28,699 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,33,026కు చేరాయి. ఇందులో 22,47,495 మంది బాధితులు వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు