Corona: కరుగుతున్న కొత్త కేసుల కొండ

మంగళవారం, 11 మే 2021 (19:41 IST)
దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కాస్త తగ్గుతున్నట్లే కన్పిస్తోంది. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, కఠిన ఆంక్షలతో వరుసగా రెండో రోజు కొత్త కేసుల్లో తగ్గుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 3.29లక్షల మంది వైరస్‌ బారినపడ్డారు. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 40వేలు తగ్గాయి. అయితే మరణాలు మాత్రం భారీగానే ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో 3800 మందిని వైరస్‌ పొట్టనబెట్టుకుంది.
 
సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18,50,110 మంది వైరస్‌ పరీక్షలు చేయించుకోగా.. 3,29,942 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.29కోట్లకు చేరింది. ఇక ఇదే సమయంలో 3876 మంది కరోనాతో మృత్యుఒడికి చేరుకున్నారు. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 2,49,992 మందిని బలితీసుకుంది.
 
తగ్గిన యాక్టివ్‌ కేసులు
ఇక రికవరీలు కూడా భారీగా ఉండటం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 3,56,082 మంది వైరస్‌ను జయించారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1.9 కోట్లుగా ఉంది. రికవరీ రేటు 82.39శాతానికి చేరింది. మరోవైపు క్రియాశీల కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం సానుకూలాంశం. నిన్నటితో పోలిస్తే 30వేలు తగ్గాయి. ప్రస్తుతం 37,15,221 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటున్నారు. యాక్టివ్‌ రేటు 16.53శాతంగా ఉంది.
 
దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. సోమవారం మరో 25,03,756 మంది టీకా తీసుకున్నారు. దీంతో మొత్తం 17.27కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు