కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు విధించాల్సిందే : గులేరియా

ఆదివారం, 2 మే 2021 (07:52 IST)
దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తిని కట్టడి చేయాలంటే దేశ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించాల్సిందేనని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ చీఫ్ డాక్టర్ గులేరియా వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో భారత్‌లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల సామర్థ్యం తుది దశకు చేరుకుందన్నారు. పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో గత ఏడాది మార్చిలో విధించిన తరహాలో కఠిన లాక్డౌన్ విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అపుడే కరోనాను కట్టడి చేయగలమన్నారు. 
 
ముఖ్యంగా, కొన్ని రాష్ట్రాల్లో విధించిన రాత్రిపూట కర్ఫ్యూలు, వారాంతపు లాక్డౌన్‌లు ఏమాత్రం ప్రభావం చూపడం లేదని గులేరియా అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆక్సిజన్‌ అందక ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో 12 మంది చనిపోయిన ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 
 
ఢిల్లీలో ఆక్సిజన్‌ సరఫరాను పర్యవేక్షించేందుకు ఓ కేంద్రీకృత వ్యవస్థ ఉండాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి కేసులు తారస్థాయికి చేరుకుంటాయని పేర్కొన్నారు. 
 
కేసులు ఉద్ధృతంగా రావడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా కేసుల సంఖ్యను తగ్గించే దిశగా కఠిన చర్యలు అమలు చేయాలని నొక్కి చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు