శ్రీవారి భక్తులకు కొత్త మార్గదర్శకాలు... తితిదే

సోమవారం, 29 మార్చి 2021 (20:48 IST)
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులపై మరోసారి ఆంక్షలు విధించింది. స్వామివారి దర్శనం టికెట్లు కలిగిన భక్తులనే తిరుమల కొండపైకి అనుమతిస్తున్నారు. 
 
వాహనాల్లో వచ్చేవారికి దర్శనం సమయానికి ఒకరోజు ముందు మధ్యాహ్నం 1 గంట నుంచి కొండపైకి అనుమతిస్తారు. మెట్లదారిలో వచ్చే భక్తులను దర్శన సమయానికి ముందురోజు ఉదయం 9 గంటల నుంచి కొండపైకి అనుమతిస్తారు.
 
అయితే ఈ కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో ఇవాళ వచ్చిన భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. టీటీడీ తాజా ఆంక్షల గురించి సమాచారం లేని భక్తులు అలిపిరి, మెట్ల మార్గం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకోగా, వారిని విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో భక్తులు టీటీడీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
మరోవైపు, తాజాగా ఉత్తరాఖండ్‌ రిషికేశ్‌లోని తాజ్‌ హోటల్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 76 మందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ హోటల్‌ను మూడు రోజుల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 
 
హోటల్‌ను పూర్తిగా శానిటైజ్‌ చేశారు. గత గురువారం హోటల్‌లో 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం అందరికీ నిర్ధారణ పరీక్షలు చేయించింది. దీంతో తాజా కేసులు వెలుగులోకి వచ్చాయి.
 
కుంభమేళాకు సిద్ధమవుతున్న వేళ కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తుండడంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేయాలని యోచిస్తోంది.
 
కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు ప్రభుత్వం కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి చేసింది. లేదంటే వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణ పత్రమైనా ఉండాలని తెలిపింది. కుంభమేళా ఏప్రిల్‌ 1న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు