బీసీసీఐ వల్లే జహీర్, సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించారా? సీనియర్లను లెక్కచేయట్లేదా?

మంగళవారం, 20 అక్టోబరు 2015 (19:22 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీరు నచ్చకే భారత స్టార్ ప్లేయర్లైన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్‌‌లు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశారని జోరుగా ప్రచారం సాగింది. క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధం లేకుండా స్టార్ ప్లేయర్లు రిటైర్మెంట్ తీసుకోవడంపై సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ల పట్ల బీసీసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని టాక్. 
 
అంతేకాదు.. యువ క్రికెటర్లకు ప్రాధాన్యమిస్తూ.. అంతర్జాతీయ వేదికలపై తేలిపోతూ.. సిరీస్ చేజార్చుకునే క్రికెటర్లనే బీసీసీఐ నెత్తిన పెట్టుకుంటుందని.. భారత క్రికెట్‌కు మంచి పేరు సంపాదించిపెట్టి.. అంతర్జాతీయ వేదికలపై ప్రత్యర్థులను బ్యాట్‌తో, బౌలింగ్‌తో ఆటాడుకున్న సెహ్వాగ్, జహీర్ ఖాన్‌ల చివరి వినతిని బీసీసీఐ తోసిపుచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఇద్దరూ తాజాగా ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి ఆ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించాలని బీసీసీఐని కోరారు. 
 
అయితే వీరి వినతిని బీసీసీఐ సీరియస్‌గా తీసుకోలేదు. నో మోర్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ వారి రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసింది. ఇంత కాలం భారత్ తరపున క్రికెట్ ఆడి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు ఇంటర్నేషనల్ స్టార్ల చివరి కోరికను తీర్చకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. 
 
స్టార్ ఆటగాళ్లుగా రాణించి భారత క్రికెట్‌కు గుర్తింపు సంపాదించిపెట్టిన సీనియర్ క్రికెటర్లను లెక్కచేయకపోవడంపై ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. ఇంకా స్టార్ ప్లేయర్లైన సెహ్వాగ్, జహీర్ ఖాన్ లేఖల ద్వారా రిటైర్మెంట్లను ప్రకటించడాన్ని బట్టి.. బీసీసీఐ తీరుపై వారిద్దరూ బాగా హర్ట్ అయ్యారని క్రికెట్ పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి