భారత్‌తో సిరీస్ ఓటమి: శ్రీలంక కోచ్ పదవికి ఆట్టపట్టు రాజీనామా

శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (13:19 IST)
భారత్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌తో పాటు స్వదేశంలో రెండు వరుస సిరీస్ కోల్పోయిన శ్రీలంక క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. శ్రీలంక క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్‌గా ఉన్న మాజీ క్రికెటర్ మర్వన్ ఆటపట్టు తన పదవికి గురువారం రాజీనామా చేశాడు. టీమిండియాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌‌ల సిరీస్‌ను శ్రీలంక 1-2తేడాతో కోల్పోయింది. అంతకుముందు స్వదేశంలో పాకిస్థాన్‌తో సిరీస్‌లో కూడా లంక ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో వరుస సిరీస్‌ ఓటములకు బాధ్యత వహిస్తూ ఆటపట్టు కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు. అతని రాజీనామాను ఆమోదిస్తున్నట్టు శ్రీలంక క్రికెట్‌ తాత్కాలిక అధ్యక్షుడు సిదాత్‌ వెట్టిముని తెలిపాడు. ఆటపట్టు శ్రీలంక తరఫున 90 టెస్టులు, 268 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5502, వన్డేల్లో 8529 పరుగులు సాధించాడు. శ్రీలంక జట్టుకు 2011 నుంచి బ్యాటింగ్‌ కోచ్‌గా సేవలందించిన ఆటపట్టు గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.

వెబ్దునియా పై చదవండి