ఇంగ్లండ్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే టీమిండియాలో తనకు స్థానం దక్కలేదనే కోపంలో ఉన్నాడు.. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి స్థానం దక్కగా.. తనకెందుకు ఛాన్స్ లభించలేదని వాపోయిన భజ్జీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ధోనీతో పోల్చుకోవడం సబబు కాదని కొందరు, ధోనీకి భజ్జీ వ్యతిరేకమని మరికొందరు ట్విట్టర్లో తిట్టిపోశారు.
నెటిజన్ల నుంచి తనకు నిరసన సెగ తగలగానే భజ్జీ ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. సెలెక్టర్ల వైఖరిని తప్పుబట్టానే తప్ప.. ధోనీకి తాను వ్యతిరేకం కాదని ట్విట్టర్లో భజ్జీ క్లారిటీ ఇచ్చాడు. దయచేసి తన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని.. అసలు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడానో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి అంటూ ట్విట్టర్ ఖాతా వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ధోనీ తనకు మంచి మిత్రుడని, అత్యుత్తమ ఆటగాడని.. ఆయనకు వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నాడు. ముఖ్యంగా ధోనీ ఎంపికను తాను తప్పుబట్టలేదని చెప్పాడు.