అతడి నుంచి నేర్చుకుంటాను, నేర్చుకుంటున్నాను, నేర్చుకుంటూనే ఉంటాను : అని అన్నదెవరు?

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (04:11 IST)
టీమిండియాలో కోహ్లీ, ధోనీ మధ్య సమన్వయం, సాన్నిహిత్యం ఆటగాళ్ల మధ్య అనుబంధాల సరిహద్దులనే చెరిపివేస్తున్నాయి. అతడినంచి నేను నేర్చుకుంటాను, ఇప్పటికీ, ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాను అని ఒక కెప్టెన్  బహిరంగంగా ప్రకటించాడంటే అంత ప్రశంస అతడంత గొప్ప ఆటగాడై ఉండాలి. అలాంటి ఆటగాడి మాటకు విలువ ఇవ్వడం అంటే కెప్టెన్‌గా తనకు తాను విలువ ఇచ్చుకోవడమే అవుతుంది. కీలక సమయాల్లో ధోని అనుభవం జట్టుకు, కెప్టెన్‌కు ఎంతగా ఉపయోగపడుతోందో ఆట ముగిసాక కెప్టెన్ చేస్తున్న ప్రకటనలే తెలుపుతున్నాయి.
 
ఇంగ్లండ్‌తో టి20 పోటీల్లో మూడో మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ ధోనీకి సమున్నత గౌరవం ఇచ్చి ఆదర్శం నెలకొల్పాడు. కెప్టెన్సీ తనకు కొత్త కాకపోయినా కీలక సమయాల్లో ధోని అనుభవం తనకు ఎంతో ఉపయోగపడుతోందని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్యానించాడు. 
 
‘కొంత కాలంగా నేను టెస్టు కెప్టెన్‌గా ఉన్నాను. కానీ వన్డేలు, టి20ల్లో పరిణామాలు వేగంగా మారిపోతుంటాయి. కాబట్టి సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా ఉండి ఆటను బాగా అర్థం చేసుకోగలిగిన ధోనిలాంటి వ్యక్తినుంచి కీలక సమయాల్లో సూచనలు తీసుకోవడం మంచిదే. చివరి మ్యాచ్‌లో చహల్‌ తర్వాత పాండ్యాకు బౌలింగ్‌ ఇద్దామని భావించినా, ఆఖరి ఓవర్‌ దాకా వేచి చూడవద్దనే అతని సలహాతోనే బుమ్రాకు బంతిని అందించాను’ అని కోహ్లి వివరించాడు.
 
ఇంగ్లండ్‌తో మూడు ఫార్మాట్‌లలోనూ సిరీస్‌ గెలుచుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందన్న కెప్టెన్‌... కొత్త కుర్రాళ్లు తమకు ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవడమే ఈ సిరీస్‌ల ద్వారా భారత్‌కు దక్కిన అతి పెద్ద ప్రయోజనమని చెప్పాడు. చాహల్ నుంచి అలాంటి అద్భుత ప్రదర్శన తానూ ఊహించకపోయినప్పటికీ అతడిలో అలాంటి ప్రతిభకు కొదవలేదని ఐపీఎల్‌లోనే గ్రహించానని సరైన సమయంలో తన టాలెంటును చాహల్ నిరూపించుకున్నాడని కోహ్లీ కితాబిచ్చాడు.
 

వెబ్దునియా పై చదవండి