భారత్‌తో నాలుగో టెస్టు.. లబుషేన్ సెంచరీ.. ఆస్ట్రేలియా స్కోర్ 274/5

శుక్రవారం, 15 జనవరి 2021 (17:06 IST)
Marnus Labuschagne
భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో.. ఆస్ట్రేలియాదే పైచేయి. స్టార్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ (204 బంతుల్లో 9 ఫోర్లతో 108) సూపర్ సెంచరీకి తోడు మాథ్యూ వేడ్(87 బంతుల్లో 45) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ టిమ్ పైన్(38 బ్యాటింగ్), కామెరూన్ గ్రీన్ (28 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్‌లోనే గట్టి షాకిచ్చాడు. ఆ ఓవర్ చివరి బంతికి స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌(1)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఫస్ట్‌ స్లిప్‌కు కాస్త ముందు పడుతున్న బంతిని రెండో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్‌ శర్మ డైవ్‌ చేస్తూ సూపర్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. 
 
ఇక తొమ్మిదో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన శార్దూల్‌ ఠాకూర్‌ తొలి బంతికే సంప్రదాయక ఫార్మాట్‌లో ఫస్ట్ వికెట్‌ సాధించాడు. మార్కస్‌ హారిస్‌ (5) వాషింగ్టన్‌ సుందర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో ఆసీస్ 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 
 
ఈ జోడీని అరంగేట్ర స్పిన్నర్ వాషింగ్టన్ సుంధర్ విడదీశాడు. రహానే సూపర్ ఫీల్డింగ్ సెటప్‌తో సుంధర్ ఉచ్చులో చిక్కిన స్టీవ్ స్మిత్(77 బంతుల్లో 36) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మిడాఫ్ మీదుగా షాట్‌కు ప్రయత్నించగా.. షార్ట్ మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు చిక్కాడు. 
 
క్రీజులోకి మాథ్యూ వేడ్ రాగా.. లబుషేన్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కెప్టెన్ రహానే నేలపాలు చేశాడు. మరికొద్దిసేపటికే నటరాజన్ బౌలింగ్‌లో లబుషేన్ ఇచ్చిన మరో అవకాశాన్ని పంత్- పుజారాలు వృథా చేశారు. ఈ అవకాశాలను అందుకున్న లబుషేన్ సుందర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 145 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ధాటిగా ఆడిన లబుషేన్.. మాథ్యూ వేడ్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశాడు. 
India_Australia
 
మరోవైపు వేడ్ కూడా నిలకడగా ఆడటంతో ఆసీస్ స్కోర్ బోర్డు పరుగు తీసింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన లబుషేన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే నటరాజన్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే మాథ్యూ వేడ్(45) ఠాకుర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో.. నాలుగో వికెట్‌కు నమోదైన 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక నట్టూ మరసటి ఓవర్‌లో సెంచరీ హీరో లబుషేన్ కథ ముగిసింది. ప్రస్తుతం కెప్టెన్ పైన్, కామెరూన్ గ్రీన్ క్రీజులో వున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు