దక్షిణాఫ్రికా జట్టుకు షాకిచ్చిన భారత్ ఏ జట్టు.. 8 వికెట్ల తేడాతో విజయం

మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (15:48 IST)
భారత్ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సిరీస్ ప్రారంభానికి ముందు మంగళవారం జరిగిన ఏకైక ట్వంటీ-20 వామప్ మ్యాచ్‌లో సఫారీ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత్ ఏ జట్టు సఫారీలను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించారు.
 
 
ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ డీ విల్లియర్స్ 37, ప్లెసిస్ 42, డుమ్నీ 68 (నాటౌట్), మిల్లర్ 10, బెహర్డైన్ 17 (నాటౌట్) చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగుల రూపంలో 13 రన్స్ వచ్చాయి. 
 
ఆ తర్వాత 190 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మరో రెండు బంతులు మిగిలివుండగానే రెండు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత ఏ జట్టు ఓపెనర్లు వోహ్రా 56, అగర్వాల్ 87, శాంమ్సన్ 31 (నాటౌట్), మన్‌దీప్ సింగ్ 12 (నాటౌట్) చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో ఏడు పరుగులు వచ్చాయి. 

వెబ్దునియా పై చదవండి