చెన్నై ట్వంటీ20 : వెస్టిండీస్ చిత్తు ... భారత్ తీన్‌మార్

సోమవారం, 12 నవంబరు 2018 (11:38 IST)
చెన్నై వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఆఖరి ట్వంటీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్లతో విజయభేరీ మోగించింది. దీంతో మూడు మ్యాచ్‌లో ట్వంటీ20 సిరీస్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ సేన కైవసం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన భారత్ బౌలింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు హెట్‌మైయిర్‌, షై హోప్‌ తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారిన వీరిని స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ పెవిలియన్‌కు పంపించాడు. 
 
దినేశ్‌ రామ్‌దిన్‌ (15; 15 బంతుల్లో ఒక ఫోర్) పరుగులకే వెనుదిరిగాడు. డారెన్‌ బ్రావో (43; 37 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్), నికోలస్‌‌ పూరన్‌ (53; 25 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్) విరుచుకుపడ్డారు. వీరిద్దరూ 43 బంతుల్లో 87 పరుగుల కీలకమైన భాగస్వామ్యం అందించారు. ఖలీల్‌ వేసిన చివరి ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు సాధించారు. దీంతో టీమిండియా ముందు 182 పరుగుల లక్ష్యం ఉంచారు.
 
ఆ తర్వాత భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. శిఖర్‌ ధవన్‌ (62 బంతుల్లో 10 x4,  2x6లతో 92), రిషభ్‌ పంత్‌ (38 బంతుల్లో 5x4, 3x6లతో 58) రాణించడంతో భారత్‌కు ఎదురులేకుండా పోయింది. 
 
ఈ మ్యాచ్‌లో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ (4) భారత్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. ఫోర్లతో విరుచుకుపడిన రాహుల్‌ (17) కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్‌.. ధవన్‌తో జతకలిసి దూకుడు పెంచాడు. ఆఖరి ఓవర్‌లో విజయానికి 5 పరుగులు అవసరమవగా తొలి రెండు బంతులకు 3 పరుగులు వచ్చాయి. మూడో బంతికి పాండే సింగిల్‌ తీయడంతో స్కోరు సమమైంది. నాలుగో బంతికి రన్‌ రాలేదు.. ఐదో బంతికి ధవన్‌ అవుటవడంతో ఉత్కంఠ నెలకొంది. ఆఖరి బంతికి పాండే వేగంగా సింగిల్‌ తీయడంతో భారత్‌ గెలుపును సొంతం చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు