భారత షూటర్లకు చేదు అనుభవం : విమానాశ్రయంలో.. ఆయుధాలుండటంతో..!

శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (14:27 IST)
భారత షూటర్లు అంజలీ భగవత్‌, హీనా సిద్ధూలకు బ్యాంకాక్‌ విమానాశ్రంలో చేదు అనుభవం ఎదురైంది. వారి లగేజీలో ఆయుధాలు ఉండడంతో బ్యాంకాక్‌ నుంచి ముంబై తిరుగు ప్రయాణంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం ఎక్కేందుకు వారికి అనుమతి లభించలేదు. దీంతో ఎయిర్‌పోర్టులోనే నిద్రలేని రాత్రి గడపాల్సి వచ్చింది. అంజలీ, హీనాలు కొరియాలో జరిగిన ప్రపంచకప్‌ షూటింగ్‌లో పాల్గొని కొరియా విమానంలో బుసాన్‌ నుంచి బ్యాంకాక్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుగు ప్రయాణమయ్యారు. 
 
అక్కడ నుంచి ముంబైకి మరో ఫ్లయిట్‌లో చేరుకోవాలి. అయితే వారి లగేజీలో ఆయుధాలు ఉండడంతో జట్‌ ఎయిర్‌వేస్‌ సెక్యూరిటీ మేనేజర్‌ వారిని విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. క్రీడాకారులుగా ఆయుధాలను తమతో తీసుకెళ్లేందుకు అన్ని రకాల అనుమతులున్నాయని చెప్పినా అతను ససేమిరా అన్నాడని హీనా తెలిపింది. ఆ తర్వాత జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ కలుగజేసుకోవడంతో అంజలీ, హీనాలు ఎయిర్‌ ఇండియా విమానంలో ఎనిమిది గంటలు ఆలస్యంగా ముంబై చేరినట్లు హీనా చెప్పింది. 

వెబ్దునియా పై చదవండి