చివరి మూడు టీ20లో క్లోజ్డ్ డోర్స్ మధ్య ఆడనున్న క్రికెటర్లు

మంగళవారం, 16 మార్చి 2021 (13:07 IST)
స్వదేశంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. మరో మూడు మ్యాచ్‌లు మిగిలివుండగా, మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మూడు టీ20లు స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది.
 
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న చివరి మూడు మ్యాచ్‌లను క్లోజ్డ్ డోర్స్ లో నిర్వహించాలని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌తో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయించామని బీసీసీఐ తెలిపింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకుంది. స్థానిక వైద్యాధికారులతో కూడా బీసీసీఐ చర్చలు జరిపింది.
 
కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని బీసీసీఐ ఈ సందర్భంగా తెలిపింది. చివరి మూడు టీ20లకు టికెట్లు కొన్న వారికి డబ్బులు చెల్లిస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పింది.
 
దీనిపై గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే చివరి మూడు టీ20లను నిర్వహించనున్నామని తెలిపింది. కాంప్లిమెంటరీ టికెట్లు అందుకున్న వారు కూడా స్డేడియంకు రావద్దని కోరింది. మరోవైపు, ఈరోజు మూడో టీ20 జరగనుంది. 18వ తేదీన మూడో మ్యాచ్, 20న చివరి మ్యాచ్ జరగనున్నాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు