వన్డే క్లబ్ గేమ‌లో లివింగ్‌స్టోన్ వరల్డ్ రికార్డు: 138 బంతుల్లోనే 350 రన్స్!

మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (11:25 IST)
వన్డే క్లబ్ గేమ్‌లో లాంకషైర్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ క్లబ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా నాంట్‌విచ్ టౌన్‌తో కాడ్లీలో జరిగిన మ్యాచ్‌లో అతను 138 బంతుల్లోనే 350 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 34 ఫోర్లు, 27 సిక్సర్లు ఉన్నాయి. 298 పరుగులను అతను బౌండరీల రూపంలోనే సాధించడం విశేషం. 
 
క్లబ్ స్థాయిలో భారత దేశానికి చెందిన 15 ఏళ్ల నిఖిలేష్ సుందరమ్ 2008లో అజేయంగా 334 పరుగులు సాధించి నెలకొల్పిన రికార్డును లియామ్ బద్దలు చేశాడని ఇసీబీ ప్రకటించింది. కాగా, లియామ్ విజృంభణతో లాంకషైర్ 45 ఓవర్లలో ఏడు వికెట్లకు 579 పరుగులు సాధించగా, అనంతరం బ్యాటింగ్ చేసిన నాంట్‌విచ్ కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. లాంకషైర్ 500 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, క్లబ్ క్రికెట్‌లో మరో రికార్డును సొంతం చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి