భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్‌గా రికార్డు నమోదు చేశాడు. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్‌తో శనివారం జరిగిన టీ20తో మొత్తం 325 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీంతో అన్ని ఫార్మెట్లలో కలిపి కెప్టెన్‌గా ధోనీదే ఉత్తమ రికార్డు. మహీ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 324 మ్యాచ్‌లకు సారథ్యం వహించి రెండో స్థానంలో ఉన్నాడు.
ఐసీసీ నిర్వహించే అన్ని ప్రపంచ స్థాయి టోర్నీల్లో కప్ అందుకున్న ఏకైక కెప్టెన్ కూడా ధోనీనే. వన్డే, టీ20 వరల్డ్ కప్‌లతో పాటు, ఛాంపియన్ ట్రోఫీలో భారత్‌కు కప్ అందించాడు. 71 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించి ఈ ఫార్మెట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన వికెట్ కీపర్‌గా కూడా ధోనీ రికార్డ్ నమోదు చేసిన విషయం తెల్సిందే.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోనీ అన్ని రికార్డులు సొంతం చేసుకున్న విషయంతెల్సిందే. 2007లో సౌతాఫ్రికా గడ్డపై జరిగిన వరల్డ్ 20-20 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత 2011లో ముంబై వేదికగా జరిగిన వన్డే వరల్డ్ పోటీల్లో జట్టును విశ్వవిజేతగా నిలిచాడు. 2013లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్నాడు. 2007 నుంచి 2016 మధ్య కాలంలో 60 టెస్టులకు, 194 వన్డేలకు, 71 ట్వంటీ-20 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు.