2016 అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సొంతం చేసుకున్న స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అశ్విన్ గెలుచుకోవడం గర్వకారణమే అయినా, ఆ తరువాత అతను చేసిన ట్వీట్ మాత్రం టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు కోపం తెప్పించింది.
ఈ అవార్డును సొంతం చేసుకునేందుకు కోహ్లీ, కోచ్ కుంబ్లే, ఫిట్ నెస్ కోచ్ శంకర్ బసూ, భార్య ప్రీతిలే కారణమంటూ అశ్విన్ ట్వీట్ చేయడం ధోని అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. విదేశాల్లో అశ్విన్ పేలవమైన ఫామ్‌లో ఉన్నప్పుడు అతనికి మద్దతుగా నిలిచిన ధోని ఇప్పుడు ఏమయ్యాడంటూ పలువురు ట్వీట్లలో విమర్శలు గుప్పించారు.
'నీకు కఠినమైన పరీక్ష ఎదురైనప్పుడు అండగా నిలిచిన ధోని భాయ్‌ని మరిచిపోయావా?అని ఒక అభిమాని ప్రశ్నించగా, అసలు ధోని గురించి ఏమి మాట్లాడలేదే?'అని మరో ఫ్యాన్ ప్రశ్నించాడు. కాగా, తాను అశ్విన్ అభిమానినంటూ పేర్కొన్న ఒక యువకుడు మాత్రం తీవ్రంగా తప్పుబట్టాడు.