రోహిత్ సారథ్యంలో ఆ రెండు ట్రోఫీలు కూడా టీమిండియా సాధిస్తుంది : జై షా

వరుణ్

సోమవారం, 8 జులై 2024 (09:49 IST)
ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్ పోరులో సౌతాఫ్రికాను చిత్తుచేసిన భారత క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జైష షా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, రోహిత్ శర్మ కెప్టెన్సీ, టీమిండియా సమిష్టితత్వంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా, రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను కూడా ఖచ్చితంగా గెలుచుకుంటుందని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రోహిత్ శర్మ కెప్టెన్సీ సంతృప్తికరంగా సాగుతోందన్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా రాబోయే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లోనూ విజయం సాధిస్తుందని, అదేక్రమంలో చాంపియన్స్ ట్రోఫీలోనూ విజేతగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
 
'టీమిండియా టీ20 వరల్డ్ కప్-2024 ట్రోఫీని గెలుచుకుని బార్బడోస్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తుందని నేను రాజ్‌కోట్‌లోనే చెప్పాను. రోహిత్ శర్మ అది నిజం చేసి చూపించాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో చివరి 5 ఓవర్లే నిర్ణయాత్మకంగా మారాయి. ఆఖరి ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్, జస్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ప్రధాన పాత్ర పోషించారు. ఈ వరల్డ్ కప్ విజయం తర్వాత మా టార్గెట్ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్, ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ. ఈ రెండింటిలోనూ రోహిత్ శర్మ టీమిండియాను విజయపథంలో నడిపిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉంది' అని జై షా వివరించారు. కాగా, టీ20 వరల్డ్ కప్ విజయాన్ని కోచ్ రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలకు అంకితం ఇస్తున్నట్టు జై షా ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు