భారత్-పాక్ క్రికెట్ సిరీస్‌: శ్రీలంక వేదికగా దాయాదుల పోరు

మంగళవారం, 24 నవంబరు 2015 (12:56 IST)
భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌పై ఎట్టకేలకు అనిశ్చితి తొలగిపోయింది. సుదీర్ఘకాలంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సిరీస్‌కు శ్రీలంక వేదిక కానుంది. ఈ మేరకు శ్రీలంక వేదికగా భారత్-పాకిస్థాన్ సిరీస్‌కు బీసీసీఐ, పీసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

ఈ క్రికెట్ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 27వ తేదీన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య క్రమం తప్పకుండా ద్వైపాక్షిక సిరీస్‌లు జరపాలని బీసీసీఐ, పీసీబీ నిర్ణయించాయి. అయితే ఈ సిరీస్‌లకు వేదికగా యూఏఈని ఎంచుకుందామన్న పీసీబీ వాదనకు బీసీసీఐ అంగీకరించలేదు. 
 
అలాగే భారత్‌లో సిరీస్ నిర్వహిద్దామన్న బీసీసీఐ ప్రతిపాదనకు పీసీబీ కూడా సమ్మతించలేదు. దీంతో ఇరు బోర్డుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో శ్రీలంక వేదికగా సిరీస్ నిర్వహణకు ఇరు బోర్డులు దాదాపుగా ఓకే చెప్పేశాయని తెలుస్తోంది.

అయితే ఈ క్రికెట్ సిరీస్‌లో భాగంగా ముందనుకున్న ప్రకారం రెండు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు ట్వంటీ-20లు కాకుండా కేవలం మూడు వన్డేలు, రెండు ట్వంటీ-20లతోనే సిరీస్‌ను నిర్వహించేందుకు ఇరు బోర్డుల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి