ప్రస్తుతం బీసీసీఐ చీఫ్‌గా కొనసాగుతున్న అనురాగ్ ఠాకూర్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుకు తదుపరి అధ్యక్షుడు ఎవరే దానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. లోథా కమిటీ సిఫారసుల ప్రకారం 70 ఏళ్లు పైబడిన వారు ఈ పదవిని చేపట్టడానికి అనర్హులు. దీంతో గంగూలీ పేరు తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం దేశంలో ఐదు క్రికెట్ జోన్లు ఉన్నాయి. మూడేళ్లకోసారి రొటేషన్ పద్ధతిలో బీసీసీఐ చీఫ్‌ను ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారంగా ప్రస్తుతం ఈస్ట్ జోన్ టర్మ్ కావడంతో ఆ ప్రాంతానికి చెందిన అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ చీఫ్‌గా ఉంటూ తన పదవిని కోల్పోయారు. దీంతో ఇపుడు ఇదే జోన్‌కు చెందిన వ్యక్తినే ఎన్నుకోవాల్సి ఉంది.
అనురాగ్ ముందు శశాంక్ మనోహర్ ఈస్ట్ జోన్ నుంచే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఐసీసీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో ఈస్ట్ జోన్ నుంచి అధ్యక్ష పదవిని అధిరోహించగల వ్యక్తి ఎవరా? అని ఆరా తీస్తే డేరింగ్ అండ్ డ్యాషింగ్ సౌరవ్ గంగూలీనే కనిపిస్తున్నాడు. అంతులేని క్రికెట్ అనుభవంతో పాటు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్న గంగూలీకీ బీసీసీఐ బాస్ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.