ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : సెమీస్‌తో భారత్ ఎవరితో తలపడుతుంది?

వరుణ్

మంగళవారం, 25 జూన్ 2024 (12:28 IST)
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, భారత్ సెమీస్‌కు అడుగుపెట్టింది. సోమవారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో భారత్ సునాయాసంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. అయితే, గ్రూపు 1 జట్ల మధ్య ఈ నెల 27వ తేదీన సెమీస్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో రెండవ సెమీఫైనల్ పోరులో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కాగా 2022 టీ20 వరల్డ్ కప్ కూడా సెమీఫైనల్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్ భారత్‌ను ఓడించి ఫైనల్‌కు వెళ్లిన ఇంగ్లీష్ జట్టు టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది.
 
కాగా గ్రూప్-1 నుంచి మరో సెమీ ఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య పోటీ నెలకొంది. బంగ్లాదేశీపై గెలిస్తే ఆఫ్ఘనిస్థాన్ నేరుగా సెమీస్ చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే నెట్ రన్ రేట్ ఆధారంగా ఆసీస్, ఆఫ్ఘాన్ జట్లలో ఒకటి సెమీస్ చేరుకుంటుంది. అర్హత సాధించిన జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొట్టాల్సి ఉంటుంది. 
 
మరోవైపు, ఈ వరల్డ్ కప్ టోర్నీలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. భారత్ వరుసగా ఆరో గెలుపును సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సగర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టిన విషయం తెల్సిందే. కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 పరుగులు బాదడం, బౌలర్లు అందరూ సమష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 24 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఆడాడు. కేవలం 43 బంతుల్లోనే 76 పరుగులు బాదాడు. ఇక కెప్టెన్ మిచెల్ మార్ష్ వేగంగా ఆడి 37 పరుగులు రాబట్టాడు. 
 
వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ ఆసీస్ వైపే ఉన్నట్టుగా అనిపించింది. అయితే భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక సమయంలో 2 ముఖ్యమైన వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. ఆ తర్వాత అర్ష‌దీప్ సింగ్ 3 వికెట్లు, బుమ్రా 1 వికెట్ పడగొట్టడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు