సచిన్ కోచ్ కన్నుమూత.. పాడె మోసిన మాస్టర్ బ్లాస్టర్.. భావోద్వేగం

గురువారం, 3 జనవరి 2019 (17:45 IST)
మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు గురువారం ముగిశాయి. గత నాలుగేళ్ల పాటు అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన అచ్రేకర్.. బుధవారం తన స్వగృహంలో మృతి చెందారు. అచ్రేకర్ మృతి పట్ల క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సచిన్ లాంటి గొప్ప క్రికెటర్‌ను దేశానికి ఇచ్చిన కోచ్... తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడాన్ని క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా ఆరంభమైన నాలుగో టెస్టులోనూ ఇరు జట్ల ఆటగాళ్లు సంతాప సూచకంగా ‌బ్లాక్ రిబ్బన్‌‌‌ని చేతికి ధరించి మ్యాచ్ ఆడారు. ఇక ముంబయిలో జరిగిన అచ్రేకర్ అంతిమయాత్ర‌కి వినోద్ కాంబ్లీతో కలిసి హాజరైన సచిన్ టెండూల్కర్.. స్వయంగా తన చిన్ననాటి కోచ్ భౌతిక కాయాన్ని ఉంచిన పాడెను మోశారు. 
 
అంత్యక్రియల సందర్భంగా సచిన్ భావోద్వేగానికి గురైయ్యారు. కాగా.. అచ్రేకర్ వద్ద సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, అజిత్ అగర్కార్, రమేశ్ పొవార్ తదితర క్రికెటర్ల‌ు శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. అచ్రేకర్ శిక్షణతో సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు