ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ముంబై ఇండియన్స్ గెలుపును నమోదు చేసుకుంది. చెన్నై జట్టులో బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో షేన్ వాట్సన్ ఆ జట్టును ఆదుకున్నాడు. జట్టును లక్ష్యాన్ని చేర్చేందుకు ఇబ్బందులు పడ్డాడు. ఈ మ్యాచ్‌లో 59 బంతుల్లో 80 పరుగులు సాధించాడు.
మ్యాచ్ కోసం తన గాయాన్ని కూడా లెక్కచేయలేదు. కాలిలో గాయానికి ఆరు కుట్లు పడినా.. ఆ గాయం నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా మ్యాచ్ ఆడాడు. అతని కాలి వెంట అలా రక్తం కారుతున్నా.. ఎవ్వరూ పట్టించుకోకుండా మ్యాచ్‌పైనే దృష్టి పెట్టారు. దీనిపై చెన్నై బౌలర్ భజ్జీ మాట్లాడుతూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో వాట్సన్ ఫోటోను పోస్టు చేశాడు. షేన్ వాట్సన్ కాలిలో రక్తం కారుతున్నా.. బ్యాట్‌ను వదలకుండా బ్యాటింగ్ చేశాడు. ఈ ఫోటోను భజ్జీ పోస్టు చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం వాట్సన్ బ్యాటింగ్‌పై సినీ నటి నయనతార బాయ్‌ఫ్రెండ్, దర్శకుడు విఘ్నేశ్ శివన్ స్పందించాడు. అంతేగాకుండా ఎయిర్‌పోర్టులో షేన్ వాట్సన్ నడవలేక నడుస్తూ వెళ్లిన ఫోటోను పోస్టు చేశాడు. ఇంకా షేన్ వాట్సన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
''ఏం మనిషి బాబోయ్. చెన్నై ప్రజల మనస్సులో సుస్థిర స్థానాన్ని సాధించుకున్నాడు. మ్యాచ్‌లను గెలవడం కంటే ప్రజల గుండెల్లో నిలవడమే ముఖ్యం" అంటూ షేన్ వాట్సన్‌ను కొనియాడాడు. ఇకపోతే.. షేన్ వాట్సన్‌కు చెన్నై ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన్ని కొనియాడుతూ.. పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు.