క్రికెట్ వరల్డ్ కప్ : భారత ఫీల్డింగ్‌కు సానబెట్టిన వ్యక్తి ఎవరు?

మంగళవారం, 3 మార్చి 2015 (10:17 IST)
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఆతిథ్యమిస్తున్న ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రతిభను కనబరుస్తోంది. ఫలితంగా ఇప్పటి వరకు ధోనీ గ్యాంగ్ ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయభేరీ మోగించింది. వీటిలో రెండు పటిష్టమైన పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.
 
అయితే, ఈ ప్రపంచ కప్‌లో ఏమాత్రం ఆశలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు.. ఇపుడు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతుండటం ప్రతి ఒక్కరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఫీల్డింగ్‌తో ఆకట్టుకునే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లకు ధీటుగా టీమిండియా ఆటగాళ్లు మైదానంలో బంతిని అడ్డుకుంటున్నారు. 
 
అద్భుత విన్యాసాలతో ఇంత వరకు జరిగిన మూడు మ్యాచ్‌లలో 23 క్యాచ్‌లు పట్టారు. వీటిలో ఒక్క క్యాచ్‌ను వదిలిపెట్టకుండా నూటికి నూరు మార్కులు కొట్టేశారు. ఈ 23 క్యాచ్‌లే వరల్డ్ కప్‌లో ఇంతవరకు ఓటమి లేకుండా ఉండడానికి కారణమని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ నైపుణ్యం ఉన్నపళంగా పెరగడం వెనుక ఉన్నదెవరని సర్వత్ర ఆసక్తి పెరుగుతోంది. 
 
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయనే భారత ఫీల్డింగ్‌పై ప్రత్యేక శ్రద్ధపెట్టాడు. మైదానంలో పాదరసంలా కదలాల్సిన అవసరాన్ని ఆటగాళ్లకు వివరించాడు. కసరత్తులు చేయిస్తూ ఆటగాళ్లలో కసి పెంచాడు. దీంతో ప్రస్తుత వరల్డ్ కప్‌లో టీమిండియా ఫీల్డింగ్ విన్యాసాలు అదరగొడుతున్నాయి. గతంలో బంతిని బౌండరీ లైన్ వద్దనున్న ఫీల్డర్‌కి చూపించే ఆటగాళ్లు, ఇప్పుడు బంతి వెనుక పరుగెత్తడానికి కారణం ఈ సంజయ్ బంగరే కారణం కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి